ఐరాస నివేదికపై భారత్‌ తీవ్ర నిరసన

జర్నలిస్ట్‌, జవాన్‌ల హత్యలు కనపడలేదా?

సీమాంతర ఉగ్రవాదం కారణమని కౌంటర్‌

న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నం సాక్షి ): కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక వెలువడిన వారం రోజుల తర్వాత భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. జెనీవాలోని ఐరాస అసెంబ్లీలో… రైజింగ్‌ కశ్మీర్‌ ఎడిటర్‌ షుజాత్‌ బుఖారీ, భారత సైనికుడు ఔరంగజేబ్‌ హత్యోదంతాలను లేవనెత్తుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఐరాస నివేదకపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి లో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్‌ కే చందర్‌ స్పందిస్తూ… సీమాంతర ఉగ్రవాదమే ప్రజల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. గతవారం సీనియర్‌ జర్నలిస్టు, ఆయన భద్రతాధికారులను దారుణంగా హత్య చేసి కశ్మీర్‌ గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు. జమ్మూకశ్మీర్‌లో ఈద్‌ జరుపుకునేందుకు బయల్దేరిన ఓ సైనికుడిని అపహరించి, అతి కిరాతకంగా చంపేశారు. సీమాంతర ఉగ్రవాదం దారుణాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..అని రాజీవ్‌ పేర్కొన్నారు. మానవ హక్కుల నివేదికలో పేర్కొన్న ఆధారాలు, ప్రస్తావనలు అత్యంత దయనీయంగా ఉన్నాయనీ… వాటిని భారత్‌ ఇప్పటికే ఖండించిందని ఐరాస అసెంబ్లీకి గుర్తుచేశారు. తీవ్రవాద సంస్థలను ‘సాయుధ దళాలు’గా పేర్కొంటూ ఐరాస నివేదిక ఉగ్రవాదులను నాయకులుగా చిత్రీకరించిందనీ… తద్వారా ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసిందన్నారు. కశ్మీర్‌ లోయలో ప్రజల చేత స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికైన ప్రభుత్వాలు రాజ్యాంగానికి కట్టుబడి ప్రమాణం చేశాయని గుర్తుచేశారు.