ఓయూలో రాజకీయ కార్యకలాపాలకు నో

తాజా ఆదేశాలతో మరోమారు స్పష్టం

రాహుల్‌ సభపై కాంగ్రెస్‌ తదుపరి నిర్ణయం

హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఉస్మానియాలో ఈ మధ్యకాలంలో ఎలాంటి సమావేవౄలకు లేదా ఊరేగింపులకు అనుమతులు ఇవ్వడం లేదు. అక్కడ రాజకీయ విన్యాసాలకు అవకాశాలు లేకుండా చూస్తున్నారు. అందుకే ఉస్మానియా యూనివర్శిటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభకు కూడా అనుమతి నిరాకరించారు. ఈ మేరకు యూనివర్శిటీ వీసీ శుక్రవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రతా కారణాలతోనే అనుమతి నిరాకరించినట్లు చెబుతున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్‌ తెలంగాణ ఫర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ పార్టీ ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్‌ గాంధీ సభ పెట్టించి విద్యార్దులను తమ వైపు తిప్పుకోవాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు సర్కారు కూడా పావులు కదిపింది. యూనివర్శిటీల్లో రాజకీయ సభలకు అనుమతించే ప్రసక్తిలేదని చెబుతూ వస్తోంది. గతంలో ఎలాంటి అనుమతలు ఇవ్వని విధంగానే ఇప్పుడు కూడా అన్న విధంగా పక్కన పెట్టేశారు. అన్నట్లుగానే యూనివర్శిటీ వీసీ రాహుల్‌ సభకు నో చెప్పారు. ఠాగూర్‌ ఆడిటోరియంలో విద్యార్ధులతో ముఖాముఖీకి కూడా అనుమతించ లేదు. అయితే దీనిపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది. కెసీఆర్‌ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉస్మానియా యువతను ఎన్నికల వేళ తమ వైపు తిప్పుకునేందుకు రాహుల్‌ గాంధీ పర్యటనను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు యోచిస్తున్నారు. వీసీ తాజా నిర్ణయాన్ని కొన్ని విద్యార్ధి సంఘాలు కోర్టులో సవాల్‌ చేయాలనే యోచనలో ఉన్నాయి. కోర్టు నుంచి కూడా అనుమతి దక్కకపోతే నగరంలోని వేరే ప్రాంతాల్లో యూనివర్శిటీ విద్యార్ధులతో సభ నిర్వహించేందుకు టీపీసీసీ రెడీ అవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్దుల పాత్ర ఎవరూ విస్మరించలేనిది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఉద్యమం సమయంలో చెప్పినట్లు ఉద్యోగాల భర్తీతోపాటు పలు అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని కొన్ని విద్యార్ధి సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకే కెసీఆర్‌ ఈ నాలుగేళ్లలో అత్యంత కీలకమైన ఉస్మానియా యూనివర్శిటీ వైపు కూడా చూడలేదు. ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నా కనీసం ఆయన మాటకూడా మాట్లాడకపోవటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. దీనికితోడు ఇక్కడ రాజకీయ పరమైన వేదికలకు ఆస్కారం లేకుండా చేశారు.