కావాల్సినంత ఇసుక ఉంది

– రహదారులు దెబ్బతినడంతో రోజువారీ ఇసుక సరఫరా చేయలేకపోతున్నాం
– మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్సూర్‌
హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందని తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ మల్సూర్‌ ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. వర్షాల వల్ల రహదారులు దెబ్బతినటంతో వినియోగదారులకు సరిపడ ఇసుక రోజువారీగా సరఫరా చేయలేకపోతున్నామని చెప్పారు. దీనిని అవకాశంగా తీసుకుని కొంతమంది ఇసుక దళారులు మార్కెట్‌ లో అధిక ధరకు ఇసుకను అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ పరిస్థితి చాలా త్వరగా కుదుటపడుతుందని మల్సూర్‌ తెలిపారు. ఏ మాత్రం వర్షాలు తగ్గినా ప్రజల అవసరాలకు సరిపడ ఇసుక టీఎస్‌ఎండీసీ సరఫరా చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజలు అధిక ధరకు ఇసుకను కొనుగోలు చేయకుండా కొంచెం వేచి ఉంటే ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని అన్నారు. వర్షాకాలంలో వినియోగదారుల కోసం 25 ప్రాంతాల్లోని తమ స్టాక్‌ యార్డుల్లో 50 లక్షల క్యూబిక్‌ విూటర్ల ఇసుక నిల్వ ఉందని మల్సూర్‌ వెల్లడించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో అధిక వర్షాలవల్ల ఇసుక సరఫరాలో కొంత ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఇందుకు ఇసుక వినియోగదారులందరు సహకరించాల్సిందిగా కోరారు.
————————–