గుదిబండ కానున్న పాత పాస్‌ పుస్తకాల రుణాలు

ప్రభుత్వంతో చర్చించేందుకు బ్యాంకర్ల యత్నాలు?

వరంగల్‌,మే14(జ‌నంసాక్షి): తాజాగా కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీతో పాత పుస్తకాలకు సంబంధించి ఉన్న రుణలపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటి వరకు రైతులు, భూముల యజమానులు దీర్ఘకాలిక రుణాలను బ్యాంకుల నుంచి తీసుకొనేవారు. ఇప్పటికే తీసుకున్న రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంకర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి. ఈ మేరకు రైతుల రునాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చే అవకాశం ఉదని తెలుస్తోంది. తమ పాత రుణాలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.పంట రుణాల కోసం సైతం నిబంధనల మేరకు రూ.2లక్షలలోపు రుణాలకు పాస్‌పుస్తకాలు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా కొందరు బ్యాంకర్లు తీసుకుంటారు. ఇలా పాస్‌పుస్తకాలు ఒక బ్యాంకులో ఉంటే.. సంబంధిత రైతు ఆ పుస్తకాలతో వేరు బ్యాంకు నుంచి రుణాలు పొందడం లేక అప్పు చెల్లించకుండా ఆ భూములను అమ్మడం చేయరనేది అసలు ఉద్దేశం. రుణాలను చెల్లించినప్పుడు వాటిని రైతులకు తిరిగి ఇచ్చేసేవారు.వ్యవసాయ భూములకు సంబంధించి తాజాగా కొత్త రైతులకు పాస్‌ పుస్తకాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రైతు పేరు, ఉన్న భూమి తదితర వివరాలు, పదిహేడు భద్రతా ఏర్పాట్లతో వీటిని జారీ చేస్తుండటంతో భవిష్యత్తులో భూములకు సంబంధించి ఎక్కడా వివాదాలకు ఆస్కారం ఉండదు. అయితే రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చిన కొందరు బ్యాంకర్లు మాత్రం ఇప్పుడు కొత్త పాస్‌పుస్తకాల జారీతో కలవరపడుతున్నారు. గతంలో తీసుకున్న రుణాలను సహజంగా వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకుంటారు. ఇలా రుణం తీసుకునేందుకు బ్యాంకుల్లో పాస్‌పుస్తకాలను పూచీకత్తుగా సమర్పించేవారు. బ్యాంకర్ల సమావేవాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు రుణాలు మంజూరు చేశారు. అలా జల్లాలో సగటున వ్యవసాయ రుణాలు ఏడాదికి రూ.1000 కోట్ల వరకు బ్యాంకర్లు ఇస్తుంటారు. దీర్ఘకాలిక రుణాలు సైతం సుమారు రూ.400కోట్ల వరకు ఉంటాయి. అయితే ఈ రుణాలు తీసుకున్నప్పుడు పూచీకత్తుగా పెట్టిన పాస్‌పుస్తకాలు ఇక చెల్లవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే పాత పాస్‌పుస్తకాల ఆధారంగా ఎలాంటి లావాదేవీలు ఇకపై జరగవు. అలాగే ఇప్పుడు బ్యాంకుల్లో ఉండే రైతుల పాస్‌పుస్తకాలు సైతం రద్దు అవుతాయి. వాటికి ఎలాంటి విలువా ఉండదు. ఇప్పుడు ఇదే బ్యాంకర్లను కలవరపరుస్తున్న అంశం. పాస్‌పుస్తకాలు ఉంటే వాటి కోసమైనా రుణాలు తీసుకున్నవారు వచ్చి తిరిగి చెల్లిస్తారు. ఇప్పుడు తమ వద్ద ఉన్న పాస్‌పుస్తకాలకు విలువ లేకపోవడం.. కొత్తవి రావడంతో రుణాలు తిరిగి ఏమేరకు చెల్లిస్తారన్న సందేహం ఇప్పుడు బ్యాంకర్లను వేధిస్తోంది. దీనిపై ప్రభుత్వంతో బ్యాంకర్లు సంప్రదించే అవకాశాలు ఉన్నాయి.