జైశ్రీరాం అనలేదని..  భార్యాభర్తలను చితకబాదారు!

– హర్యానాలోదారుణ ఘటన
– దాడికిపాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చంఢీఘర్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : రామ్‌ రామ్‌ అనలేదని దంపతులను ఓ వర్గానికి చెందిన వారు చితకబాదడం కలకలం రేపింది. అల్వార్‌ బస్టాండు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. ఆ దండగులను పట్టుకున్నారు. పూర్తి వివరాల్లో వెళితే.. హర్యానాలోని దిద్వానా నుంచి నూహ ప్రాంతానికి ఓ మతానికి చెందిన దంపతులు వెళుతున్నారు. బస్టాండులో బస్సు కోసం వెయిట్‌ చేస్తూ.. టిఫిన్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి వచ్చారు. జై శ్రీరాం అనాలంటూ బెదిరింపులకు దిగారు. రాం.. రాం నినాదాలు చేయాలని ఒత్తిడి చేశారు. ఊహించని ఈ ఘటనతో ఓ దంపతులు షాక్‌ అయ్యారు. ఎందుకు అంటూ ప్రశ్నించారు. అంతే ఆ ఇద్దరు వ్యక్తులు వారిపై దాడిచేసి కొట్టారు. మహిళను లైంగిక వేధింపులకు గురి చేశారు. చిత్రహింసలను తట్టుకోలేక వారు పెద్దపెద్దగా కేకలు వేశారు. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు, బస్టాండ్‌ లోని ప్రయాణికులు స్పందించారు. విషయం ఏంటో తెలుసుకున్న స్థానికులు.. ఆ ఇద్దరు వ్యక్తులపై తిరగబడ్డారు. ఇది పద్దతి కాదు.. వెళ్లిపోవాలని వార్నింగ్‌ ఇచ్చారు. అయినా వారు వినలేదు. దీంతో వారిని పట్టుకుని కొట్టారు. పోలీసులకు అప్పగించారు. మతం ముసుగులో కొందరు చేస్తున్న ఇలాంటి తప్పుడు పనుల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
జైశ్రీరాం నినాదాలు చేయాలంటూ దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు పోలీసులు. వారిని భరద్వాజ్‌, సురేంద్రగా గుర్తించారు. గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.