డిమాండ్‌ సాధనకు వినూత్న ఆందోళన

రక్తదానంతో నిరసన చేస్తున్న వైద్యులు
ఇంఫాల్‌,డిసెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ):  డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్రతిపక్షాలు, ఉద్యోగులు, ప్రజలు ఏదో ఒక రకంగా ప్రభుత్వం విూద నిరసన చేపట్టడం చూస్తూనే ఉంటాం. అయితే మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్‌లాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(జేఎన్‌ఐఎంఎస్‌)కు చెందిన వైద్యులు మాత్రం వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగోన్నతి కల్పించాలని నిత్యం రక్తం దానం చేస్తున్నారు. నిత్యం మూడు యూనిట్ల రక్తాన్ని జేఎన్‌ఐఎంఎస్‌ బ్లడ్‌ బ్యాంకుకు పంపిస్తున్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించేవరకు దాన్నలాగే కొనసాగిస్తారట. ‘మా డిమాండ్లతో కూడిన లేఖను ముఖ్యమంత్రి,
ఆరోగ్య శాఖ మంత్రికి పంపించాం. అయితే వారి నుంచి అనుకూల స్పందన రాలేదు. మాకు న్యాయం జరిగే వరకు బ్లడ్‌ బ్యాంకుకు మూడు యూనిట్ల రక్తాన్ని దానం చేస్తూనే ఉంటాం. ఈ నిరసనలో 50 మంది వైద్యులు పాల్గొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ రక్తం ఉపయోగపడుతుంది. మా భవిష్యత్తుకే భద్రత లేనప్పుడు, విధులు సక్రమంగా ఎలా నిర్వహించగలం’ అని ఆ వైద్యులు వాపోయారు.