నిరుద్యోగ భృతి సంగతి మరిచారా

నిరుద్యోగుల ఆగ్రహంతోనే ఉద్యోగాల ప్రకటన: విహెచ్‌
హైదరాబాద్‌,మార్చి9(జనం సాక్షి): నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే సీఎం కేసీఆర్‌ ఈరోజు ఈ ఉద్యోగ ప్రకటన చేశారని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. ఉద్యోగాల ప్రకటనను తాము స్వాగతిస్తు న్నామని.. కానీ గతంలో హావిూ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.తెలంగాణలో కొత్తగా 80వేల ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్‌ వల్లే రాలేదని.. అందరి త్యాగాల ఫలమే తెలంగాణ రాష్ట్రం అని వీహెచ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 3 వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు కాబట్టే ఈరోజు ఉద్యోగాల ప్రకటన చేశారని వీహెచ్‌ ఆరోపించారు. వయోపరిమితిపై గురించి కాంగ్రెస్‌ ఎన్నో ఏళ్ల నుండి పోరాడితేనే ఇప్పుడు ప్రభుత్వం 49 సంవత్సరాల వయో పరిమితిని పెంచిందన్నారు. తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని.. పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగాల కోసం చనిపోయిన కుటుంబాలను కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ఆదుకోవాలని హితవు పలికారు.