రేపు చేపప్రసాదం పంపిణీ

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం

ఎగ్జిబిషన్‌ మైదానంలో ప్రత్యేక పర్యవేక్షణ

హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): హైదరాబాద్‌ పేరుచెప్పగానే బిర్యనీ ఎలా ఠక్కున గుర్తుకు వస్తుందో మృగశిర కార్తె సందర్భంగా చేపమందు కూడా అంతే గుర్తుకు రాక మానదు. ఏటా ఎందరో అస్తమా బాధితులకు బత్తిని సోదరులు అందించే చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివస్తారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దీనిపై జనవిజ్ఞానవేదిక వారు విమర్శలు చేస్తున్నా ప్రజల నమ్మకం ముందు ఇవన్నీ పనిచేయడం లేదు. ప్రభుత్వం కూడా చేపమందు పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో ప్రసాద వితరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. చేప ప్రసాదం పంపిణీ శుక్రవారం ఉదయం ప్రారంభమై శనివారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనున్నది. ఈ సందర్భంగా మత్స్యశాఖ 1.30 లక్షల కొర్రవిూను పిల్లలను అందుబాటులో ఉంచనున్నది. ప్రసాద పంపిణీకి 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు.ఇందులో మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు.ఈసారి సైతం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.రుతుపవనాలు గురువారం హైదరాబాద్‌ను తాకే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గత ఏడాది పంపిణీరోజు ఉదయం భారీవర్షం పడటంతో స్వల్ప అంతరాయం కలిగింది. ఆర్డీవో ఖానాపూర్‌ చంద్రకళ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తూ అధికారులందరినీ సమన్వయం చేస్తున్నారు. ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రసాద వితరణ కోసం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో వీఐపీలకు ఒకటి, వృద్ధులు, దివ్యాంగుల సౌల భ్యం కోసం మరో కౌంటర్‌ను కేటాయించారు. క్యూలైన్లలో ఒత్తిడిని నివారించడంలో భాగంగా టోకెన్ల విధానాన్ని అమలు చేయనున్నారు. టోకెన్ల కోసం ప్రత్యేకంగా 34 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లలో వచ్చేవారికి 30, ఎగ్జిబిషన్‌ మైదానంలోని వారికి మరో 2 మొబైల్‌ టోకెన్‌ కౌంటర్లను సిద్ధం చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు వచ్చే వారికోసం ఆర్టీసీ 133 ప్రత్యేక బస్సలను నడుపనున్నది. బందోబస్తు కోసం 1500 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. పర్యవేక్షణ కోసం ఇద్దరు అడిషనల్‌ డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 22 మంది సీఐలను, ట్రాఫిక్‌ నియంత్రణకు 150 మంది సిబ్బందిని కేటాయించారు. 70 సీసీ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వహించనున్నారు. మైదానంలో అన్ని ప్రాంతాల్లో చెత్త బుట్టలను ఏర్పాటుచేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు 13 చోట్ల స్థలం కేటాయించారు.

నిరంకారి, ఎన్‌సీసీ, బ్రహ్మకుమారీలు, స్థానిక యువతతో దాదాపు 800 మందిని వలంటీర్లుగా సేవలను అందించనున్నారు.