నేడు సమ్మక్క సారక్క జాతరకు తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌: మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. శనివారం రాత్రి సమ్మక్క సారలమ్మలు వనప్రవేశం చేయనున్నారు. దీంతో నాలుగు రోజుల జాతరకు తెరపడనుంది. వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు నిర్విరామంగా అమ్మవార్లను అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు సమ్మక్క సారలమ్మ దేవతలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దర్శించుకోనున్నారు.రెండేండ్లకోసారి జరిగే ఈ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. వన దేవతలను ఘనంగా స్వాగతించడం, గద్దెలపై ప్రతిష్ఠించి మొక్కులు సమర్పించడం, నాలుగో రోజు వన ప్రవేశం చేయించడం ఆదివాసీ సంప్రదాయం. అమ్మవార్ల వన ప్రవేశంతో మేడారం మహాజాతర పరిసమాప్తమవుతుంది. సమ్మక్క సారలమ్మల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తున్నారు.