పాక్‌ పద్ధతి మార్చుకోవాల్సిందే!

– అమెరికా రాయబారి నిక్కీహలే
వాషింగ్టన్‌, జనవరి18(జ‌నంసాక్షి): ఉగ్ర సంస్థలకు సహకారం, తద్వారా పొరుగు దేశాలను ఇబ్బందులకు గురి చేస్తున్న పాకిస్థాన్‌.. తన పద్ధతిని మార్చుకోవాలని అమెరికా చెబుతోంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హలే ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. పాక్‌ తన వైఖరిని మార్చుకునేంత వరకు జాతీయ  భద్రతా మండలి ఒత్తిడి తేవాలని ఆమె కోరుతున్నారు. భద్రతా మండలి సభ్యులతో నిక్కీ హలే ఈ మధ్యే అఫ్ఘనిస్థాన్‌లో పర్యటించి వచ్చారు. గురువారం తన పర్యటన వివరాలను ఆమె భద్రతా మండలిలో తెలియజేశారు. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్‌ చేసిన విజ్ఞప్తిని ఆమె భద్రతా మండలిలో వినిపించారు. పాకిస్థాన్‌ మూలంగా అఫ్ఘనిస్థాన్‌ సమస్యలను ఎదుర్కుంటోందని, తాలిబన్లకు పాక్‌ పరోక్షంగా సాయం చేస్తోందన్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని, వివిధ దేశాలకు చెందిన 15 మందితో ఓ విభాగాన్ని ఏర్పాటు చెయ్యండని,  తద్వారా పాక్‌పై ఒత్తిడి తీసుకురండి అని అఫ్ఘాన్‌ ప్రతినిధులు హలేకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. చర్చల కోసం కాబూల్‌ ముందుకు వస్తుంటే.. ఇస్లామాబాద్‌ మాత్రం కవ్వింపు చర్యలతో వెనక్కి తీసుకెళ్తోందని ఆమె వివరించారు. పొరుగు దేశాలను(భారత్‌సహా) ఉగ్రవాదంతో ప్రభావితం చేస్తున్న పాక్‌ విషయంలో జాతీయ భద్రతా మండలి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
పాక్‌పై ఆంక్షలు సడలించిన అమెరికా …
ఇదిలా ఉంటే పాకిస్థాన్‌కు భద్రతా పరమైన సహకారాన్ని అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఇప్పుడు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. మిలిటరీ శిక్షణ కోసం(అంతర్జాతీయ సైనిక శిక్షణ హావిూ కింద) మాత్రం నిధులను మంజూరు చేస్తున్నట్లు గురువారం ఓ
ప్రకటన విడుదల చేసింది.  ఈ విషయాన్ని పాక్‌ విదేశాగంగ కార్యదర్శి తెహ్‌మినా జన్జువా దృవీకరించారు.