ప్రధాని మోడీ డ్రీమ్‌టీంలో తెలంగాణ బిడ్డ!

తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం దక్కింది. నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా వార్తలకెక్కిన చంద్రకళకు ప్రమోషన్ లభించింది. యూపీ క్యాడర్ అధికారి అయిన ఈ తెలంగాణ తేజం.. 2014లో నాసిరకం రోడ్లు వేసిన అధికారులను, కాంట్రాక్టర్లను పబ్లిగ్గా నిలదీసి సంచలనం సృష్టించారు. ఓయూ నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్న చంద్రకళ 2008లో ఐఏఎస్ టాపర్‌గా నిలిచారు. బులంద్‌షహర్, బిజ్నోర్, మీరట్ జిల్లాల కలెక్టర్‌గా ఆమె స్వచ్ఛభారత్ కోసం ఎంతగానో కృషి చేసి పేరు తెచ్చుకున్నారు. అవినీతిపై నిప్పులు చెరిగే అధికారిగా సామాజిక మాధ్యమాల్లో చంద్రకళ పేరు మారుమోగింది. బిజ్నోర్‌ను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చేందుకు ఆమె చేపట్టిన చర్యలకు కేంద్ర సర్కారు ప్రశంసలు పొందారు. ఇప్పుడామె నిజాయితీకి, కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్రమోడీ చంద్రకళను తన డ్రీమ్‌టీంలో చేర్చుకున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్‌గా, కేంద్ర తాగునీరు, పారిశుధ్ధ్య మంత్రిత్వశాఖ ఉపకార్యదర్శిగా నియమించారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పుట్టి ఫర్టిలైజర్‌సిటీలో చదివి ఐఏఎస్‌కు ఎంపికై ఉత్తరప్రదేశ్ క్యాడర్‌లో కొనసాగుతున్న చంద్రకళకు ప్రతిష్ఠాత్మకమైన పదవి లభించడం పట్ల కోల్‌బెల్ట్‌ లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. స్వఛ్చభారత్ మిషన్‌కు ఆమెను డైరెక్టర్‌గా ఎంపిక చేయడం తెలంగాణకు గర్వకారణమని అంటున్నారు.