యువత అద్భుతాలు సృష్టించాలి

– జీవితంలోసాధించాల్సిన లక్ష్యాలపై స్పష్టతతో ఉండాలి

– అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో సామాజిక వేత్త అన్నా హజారే

హైదరాబాద్‌, జనవరి19(జ‌నంసాక్షి) : యువత అద్భుతాలు సృష్టించాలని, సుధీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సామాజిక వేత్త అన్నా హజారే పిలుపునిచ్చారు. హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరుగింది. ఈ సదస్సును శనివారం జాగృతి అధ్యక్షురాలు కవిత, అన్నాహజారేలు కలిసి జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో అన్నా హజారే మాట్లాడుతూ.. యువత పట్టుదలతో ముందుకుసాగి అద్భుతాలు సృష్టించాలని అన్నారు. ఏడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా

లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని చెప్పారు. జీవింతలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే మనల్ని దేవుడు ఇక్కడికి పంపారు. భగవంతుడు పుణ్యక్షేత్రాల్లోనే కాదు.. అన్ని చోట్లా ఉంటాడు అని అన్నా హజారే తెలిపారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకు మనం సృష్టించుకున్నవే అని తెలిపారు. ప్రపంచంలో ఏటా 22వేల మంది చిన్నారులు చనిపోతున్నారని, సుస్థిర అభివృద్ధికి ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన వల్ల ఉద్భవించిన కొన్ని సమస్యలకైనా ఈ సదస్సులో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు. యువత కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని కవిత పేర్కొన్నారు. యువత మంచి ఆలోచనలతో, సమాజహితం కోసం ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.