వాజ్‌పేయి మృతికి..

మారిషస్‌ ఘన నివాళి
– మారిషన్‌ జాతీయ జెండాతో భారత జాతీయ జెండా ఆవిష్కరణ
న్యూఢిల్లీ, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : ‘భారత రత్న’ అటల్‌ బిహారీ వాజ్‌పేయి పట్ల అంతర్జాతీయంగా గౌరవాభిమానాలు వ్యక్తమవుతున్నాయి. మారిషస్‌ ప్రభుత్వం తీసుకున్న అత్యంత అరుదైన నిర్ణయమే అందుకు ఉదాహరణ. మా రిషస్‌ ప్రధాన మంత్రి ప్రవింద్‌ కుమార్‌ జుగ్నాథ్‌ ఓ ప్రకటనలో వాజ్‌పేయికి నివాళులర్పించారు. మారిషస్‌లో శుక్రవారం భారత దేశ జాతీయ జెండాతోపాటు తమ దేశ జాతీయ పతాకాన్ని కూడా అవనతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాజ్‌పేయి గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాల జాతీయ పతాకాలు శుక్రవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అవనతం చేసి ఉంటాయన్నారు. ప్రైవేటు రంగం కూడా ఈ ఆదేశాలను పాటించాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జుగ్నాథ్‌ ఓ లేఖ రాశారు. వాజ్‌పేయి పరమపదించినందుకు సంతాపం తెలిపారు. వాజ్‌పేయి కేవలం భారతదేశం కోసం మాత్రమే కాకుండా మారిషస్‌ కోసం కూడా విశేష కృషి చేశారని పేర్కొన్నారు. మారిషస్‌ ప్రదర్శించిన సంఘీభావాన్ని భారతదేశం ప్రశంసించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి రవీశ్‌ కుమార్‌ ఓ ట్వీట్‌లో ఈ వివరాలను తెలిపారు. విషాద సమయంలో మాకు సంఘీభావం తెలిపారన్నారు. మునుపెన్నడూ లేని భావ వ్యక్తీకరణలో, మారిషస్‌లో అధికారిక కార్యాలయాలపై ఇరు దేశాల జాతీయ పతాకాలను అవనతం చేయనున్నట్లు ప్రకటించిందన్నారు.