విశాఖ రాజధానిగా ఆహ్వానిస్తున్నాం

కాపుసేన నేతల వెల్లడి
విశాఖపట్నం,డిసెంబర్‌27(జ‌నంసాక్షి):  విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని రాష్ట్ర కాపుసేన గౌరవ అధ్యక్షుడు బండారు నారాయణమూర్తి, అధ్యక్షుడు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి లంకా భాస్కరరావు, గంట్ల శ్రీనుబాబు తెలిపారు. వారు విశాఖలో శుక్రవారం విూడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ కు కృతజ్ణతలు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు జీవితాంతం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఇప్పటివరకు ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలని ఏ పార్టీ భావించలేదన్నారు. గత అనేక సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఎక్కువ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో  మా ప్రాంతానికి రాజధాని రావడం ఆనందంగా ఉందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విశాఖలో ఏర్పాటయితే ముంబాయిని మించి మహానగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పరిపాలనా రాజాధాని ఏర్పాటయితే  సినీ పరిశ్రమ విశాఖకు రావడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. సీఎం జగన్‌ దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని.. కాపుసేన తరపున ఆయనకు అభినందనలు తెలిపారు.