వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ

` ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం
` బాలాలయం నుంచి గులాహలయానికి నారసింహుడు
` యాదాద్రి పునర్నిర్మాణకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్మానం
` కొత్త ఏడాది సబ్బండ వర్గాలు సంతోషంతో జీవించాలని సీఎం ఆకాంక్ష
యాదాద్రి,మార్చి 28(జనంసాక్షి):శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహా కుంభసంప్రోక్షణ మహోత్సవం నేత్ర పర్వంగా పూర్తయ్యింది. ఉత్సవమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్లిన తర్వాత… మిథున లగ్నాన ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ పర్వాన్ని ఘనంగా నిర్వహించారు. దివ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం స్వామి వారి ఆలయంలో ఆరేళ్ల తర్వాత స్వయంభూల దర్శనభాగ్యం కలిగింది. ఉద్ఘాటన క్రతువులో భాగంగా పాంచారత్ర ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా వైభవోపేతంగా మహకుంభసంప్రోక్షణ జరిగింది. ఇందుకు స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన ఈ నెల 21న అంకురార్పణ చేసి.. బాలాలయంలో సప్తాహ్నిక దీక్షా పంచకుండాత్మక యాగం నిర్వహించారుఉదయం స్వామి వారి నిత్య కైంకర్యాల అనంతరం.. ఉద్ఘాటనకు సంబంధిత క్రతువులను ప్రారంభించారు. యాదాద్రి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో నేరుగా యాదాద్రి చేరుకున్న ఆయన.. ఆలయంపై విహంగ వీక్షణం చేశారు. పంచకుండాత్మక యాగం పూర్ణాహుతి అనంతరం.. బాలాలయం నుంచి వేదమంత్రోశ్చరణల నడుమ స్వామివారి సువర్ణమూర్తుల శోభాయాత్ర వైభవంగా సాగింది. సీఎం కేసీఆర్‌ పట్టువస్త్రాలు ధరించి?.. నేరుగా వచ్చి సతీసమేతంగా శోభయాత్రలో పాల్గొన్నారు.బాలాలయం నుంచి బయలుదేరిన శోభాయాత్రవైభవంగా శోభాయాత్ర సాగింది. స్వామివారి శోభాయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అర్చకులు, వేద పండితులు పెద్దఎత్తున శోభాయాత్రలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్వామివారి పల్లకిని తలా కాసేపు మోశారు. ఆరేళ్ల తర్వాత స్వామివారు బాలాలయం నుంచి మంగళవాద్యాలు, మహిళల కోలాటాల నడుమ.. ప్రధానాలయంలోకి ప్రవేశించారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి స్వామివారు ప్రవేశించారు. ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ఉత్సవమూర్తుల ప్రదక్షిణలు నిర్వహించారు.ఏడు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులతో.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు.. కుంభాభిషేకం, సంప్రోక్షణ గావించారు. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్‌ సమక్షంలో వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. శ్రీ సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత అందరూ.. ప్రధానాలయంలోని మండపంలోకి చేరుకున్నారు. ఉపాలయాల్లో ప్రతిష్ఠా మూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ దంపతులు స్వామివారికి ప్రథమారాధన చేశారు. అనంతరం అర్చకులు ఆరగింపు సేవ చేశారు. తర్వాత తీర్థ, ప్రసాద గోష్టి జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ మహాపర్వంలో పాల్గొని స్వామివారిని సేవించుకుని తరించారు. ఒకనాటి గుహాలయం నేడు ఆధ్యాత్మికకళాకాంతులతో అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోవటంలో భాగస్వాములైన వారందరినీ ప్రభుత్వం ఘనంగాసన్మానించింది. వాస్తుశిల్పులు,స్థపతులుసహా ఎంతో మంది ఆలయ పునర్నిర్మాణంకోసం నిరంతరం శ్రమించి…. ప్రపంచస్థాయిక్షేత్రన్ని రూపుదిద్దారు.
ఇందులోప్రధాన భూమిక పోషించిన ఆలయఈవో గీత, యాడాఉపాధ్యక్షుడు కిషన్‌రావు, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, స్థపతిసుందర రాజన్‌ సహా ఆలయ నిర్మాణభాగస్వాములైన వారందరి అధికారులు, శిల్పులు, స్వర్ణ, వడ్రంగి కళాకారులని ముఖ్యమంత్రి కేసీఆర్‌,మంత్రులు శాలువాలతో సన్మానించి, అభినందనలుతెలిపారు. వైటీడీఏ వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావును సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా సన్మానించారు. మహోజ్వలఘట్టానికి కారకుడైన సీఎం కేసీఆర్‌ను దేవస్థానం తరఫున యాడా అధికారులు, మంత్రులు ఆత్మీయంగా సత్కరించారు.అనతరం ’యాదాద్రి` ది సేక్రెడ్‌ ఎబోడ్‌’.. కాఫీ టేబుల్‌ బుక్‌ను సీఎం ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌తో ప్రజాప్రతినిధులంతా ఫొటోలు తీసుకున్న తర్వాత.. యాగశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న బోజనాన్ని స్వీకరించారు. సాయంత్రం ఏడున్నర నుంచి.. శాంతి కళ్యాణం, ఆచార్య, రుత్విక్‌ సన్మానం, మహదాశీర్వాదం, పరిసమాప్తి ఉంటుంది.
కొత్త ఏడాది సబ్బండ వర్గాలు సంతోషంతో జీవించాలి : సీఎం కేసీఆర్‌
యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి సన్నిధిలో తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి ప్రచురించిన శుభకృత్‌ నామ సంవత్సర నూతన పంచాగాన్ని సోమవారం సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 2న ఉగాది పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. రెండు సంవత్సరాలుగా కరోనాతో బాధపడుతున్న ప్రజలకు ఇప్పుడు కొంత విముక్తి లభించిందన్నారు.పండుగల విషయంలో ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలను దృష్టిలో పెట్టుకొని సామరస్య నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. శుభకృత్‌ నామ సంవత్సరంలో సబ్బండవర్గాలు సంతోషం, మానవతా విలువతో జీవించాలని ఆకాంక్షించారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జీవన్‌రెడ్డి, బ్రహ్మణ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.