సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరిగితేనే.. 

ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తాం
స్పష్టం చేసిన అమెరికా
సియోల్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరిగిన తర్వాతనే ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పొంపియో మాట్లాడారు. సియోల్‌లో దక్షిణ కొరియా, జపాన్‌ దేశ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితం సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, నార్త్‌ కొరియా నేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో జరిగిన సమావేశం తర్వాత ఈ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు సంపూర్ణంగా సహకరిస్తామని కిమ్‌ వాగ్ధానం చేశారు. దానికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఏ విధంగా ఉత్తర కొరియా అణ్వస్త్రాలను వదిలేస్తుందన్న పక్రియను మాత్రం ఇంకా ఆ దేశం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో మైక్‌ పొంపియే ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తిస్థాయిలో ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ జరిగితేనే ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయటం జరుగుతుందన్నారు. అలా జగరని పక్షంలో ఆర్థిక ఆంక్షలు కొనసాగింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.