హిందూపురంలో వేడెక్కిన జిల్లా డిమాండ్‌

అఖిలపక్షనేతలతో కలసి కలెక్టర్‌ను కలసిన బాలకృష్ణ

ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పణ

అవసరమైనే సిఎం జగన్‌ను కూడా కలుస్తానని ప్రకటన

అమరావతి,ఫిబ్రవరి5  ( జనంసాక్షి ) :  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయవేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్‌ వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికి.. పోరాటాన్ని విస్తృతం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ శుక్రవారం హిందూపురంలో మౌనదీక్ష సైతం చేపట్టారు. దీనిలో భాగంగా అఖిలక్ష నేతలతో కలిసి ఉద్యమ కార్యచరణను సైతం ప్రకటించారు.అనంతపురం జిల్లా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్‌ చేశారు.  అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు హిందూపురం పట్టణం నుంచి అనంతపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ .. హిందూపురం పట్టణంలో అన్ని వసతులు ఉన్నాయని హిందూపురాన్ని కాదని మరో ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే సహించబోమని అన్నారు. ఇంతకు ముందు ప్రకటించిన విధంగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రజల న్యాయమైన డిమాండ్‌ను సాధించేవరకు ఎంతటి పోరాటాలకైనా రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు.వైసీపీ ప్రభుత్వం తమ మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా హిందూపురంను ప్రకటించాలని అన్నారు. అవసరమైతే సీఎం అపాయింట్‌మెంట్‌ను తీసుకుని వినతి పత్రం అందజేస్తామని అన్నారు. హుటాహుటినా రాత్రికే రాత్రి జిల్లాల ఏర్పాటు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. రాజకీయ ఉద్ధేశంతోనే జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారని ఆరోపించారు. హిందూపురం జిల్లా కేంద్రంగా చేసేంతవరకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. అందుకోసం అవసరమైతే సీఎం జగన్‌ ను కలుస్తానంటూ పేర్కొన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికే.. జిల్లాల వివాదాన్ని తీసుకొచ్చారంటూ విమర్శించారు. ఒక చిన్న మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయడం వెనుక ఆంతర్యం ఏంటని అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్యసాయి జిల్లాకు తాము వ్యతిరేకం కాదని.. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్నదే తమ డిమాండ్‌ అని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు విూద ప్రేమతో ఎన్టీఆర్‌ జిల్లాను ఏర్పాటు చేయలేదని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ బాలకృష్ణ పేర్కొన్నారు. అంత ప్రేమ ఉంటే అన్నా కాంటీన్లను ఎందుకు తొలగిస్తారంటూ ప్రశ్నించారు. సినిమా టికెట్ల వివాదంపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని సినీ పెద్దలకు తెలియజేశానని తెలిపారు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం వివాదం సృష్టిస్తోందంటూ మండిపడ్డారు. రాజీనామా చేస్తే.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ విసిరిన సవాలుకు బాలకృష్ణ ఓకే చెప్పారు. హిందూపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి కలసి పని చేస్తామంటూ పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా తన పోరాటాన్ని కొనసాగిస్తానంటూ బాలయ్య స్పష్టంచేశారు.