బడ్జెట్‌లో రూ.3497 కోట్ల కేటాయింపు

హైదరాబాద్‌,మార్చి7(జనం సాక్షి): 2022`23 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్బంగా ప్రతిష్ఠాత్మకంగా చెపట్టిన ’మన ఊరు`మన బడి’ కార్యక్రమానికి రూ.3497 కోట్లు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో రూ.7289 కోట్లతో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 9123 పాఠశాలల్లో రూ.3497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించింది. పట్టణాల్లో మన బస్తీ`మన బడి అనే పేరుతో దీనిని అమలు చేస్తున్నారు. పథకంలో భాగంగా పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందులో డిజిటల్‌ విద్య అమలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నీచర్‌, పాఠశాలలకు మరమ్మతులు, రంగులు వేయడం, గ్రీన్‌ చాక్‌బోర్డులు, ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్‌ షెడ్డులు, అదనపు తరగతుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాళ్లు, నీటి సౌకర్యంతో కూడిన మరుగుదొడ్లను నిర్మించనున్నారు.