16 ఎంపి సీట్లు గెలిచి సత్తా చాటుతాం

బీజేపీ అంటే ‘బిల్డప్‌ జాతీయ పార్టీ’

కూటమికట్టినా కాంగ్రెస్‌ 100 సీట్లు సాధించదు

రాష్ట్రాలకు హక్కుల సాధనే ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యం

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌

హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపి సీట్లు సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో టిఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీజేపీ అంటే ‘బిల్డప్‌ జాతీయ పార్టీ’ అని బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. కూటమికట్టినా కాంగ్రెస్‌ 100 సీట్లు సాధించుకునే పరిస్థితి లేదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసినా మేజిక్‌మార్క్‌ రాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీలకు ఎస్పీ, బీఎస్పీ, బీజేడీలు దూరమని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో గుడ్డిలో మెల్లగా కాంగ్రెస్‌ గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌లో చేరిక అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికలే లో/-యంగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రాలకు అధికారాలు కావాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ముందస్తు ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్లే కొన్ని సీట్లు కోల్పోయామని లేదంటే 100 సీట్లు సాధించే వాళ్లమన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలు పునరావృతమవుతాయని ఈ సందర్భంగా కేటీఆర్‌ జోస్యం చెప్పారు. ఖమ్మం సీటు సహా 16లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలని.. ఇందుకు ప్రతి ఒక్క కార్యకర్త, నేతలు సహకరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 స్థానాలు తెరాస గెలుచు కోవాలన్నారు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీచేసే పరిస్థితి లేదన్నారు. ఐదు

రాష్ట్రాల ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చిందని చెప్పారు. భాజపా భారతీ బిల్డప్‌ మార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రధాని, కేంద్రమంత్రులు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినా.. ప్రజలు నమ్మలేదన్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌, భాజపాతో పొత్తు లేదని ఎస్పీ, బీఎస్పీ ప్రకటించాయని గుర్తుచేశారు. వైకాపా కూడా కాంగ్రెస్‌ భాజపాలకు దూరంగా ఉండాలని యోచిస్తోందని కేటీఆర్‌ తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఏకమై దిల్లీని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. దిల్లీలో నిర్ణయాత్మక శక్తిగా తెరాస మారనుంద న్నారు. కాంగ్రెస్‌తో 30 ఏళ్ల వైరాన్ని చంద్రబాబు మరచిపోలేదా? అని అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని చాటేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు తన అసమర్థతను ఇతరుల విూదకు నెడుతున్నారని ఆక్షేపించారు. ప్రాంతాలు విడిపోయినా.. అన్నదమ్ముల్లా కలిసే ఉంటామని తాము చెప్పామని, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎందరో సీమాంధ్ర ప్రజలు తెరాసకు ఓటు వేశారని కేటీఆర్‌ తెలిపారు.గతంలో తాను వంటేరును తెరాసలోకి ఆహ్వానించానన్న మాట వాస్తవమేననికేటీఆర్‌ అన్నారు. 2009లోనే వంటేరును తెరాసలోకి రావాలని ఆహ్వానించానని, ఆలస్యంగానైనా ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. గజ్వేల్‌ ప్రజలు అదృష్టవంతులన్నారు. నాలుగేళ్లలోనే ఆ ప్రాంతం రూపు రేఖలే మారిపోయాయని చెప్పారు. గజ్వేల్‌కు నిధుల వరద పారుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి కావస్తున్నాయని, కోటి ఎకరాల మాగాణి కావాలన్న కేసీఆర్‌ స్వప్నం త్వరలోనే సాకారమవుతుందనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు. వంటేరు ప్రతాప్‌ రెడ్డి చేరికతో గజ్వేల్‌లో తెరాస ఎదురులేని రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు తెరాస ఓట్లకు గండి కొట్టిందన్నారు. తెరాసపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తాము నిలబెట్టుకుంటామని, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ తనను రెండుసార్లు తెరాసలోకి ఆహ్వానించినా తాను వెళ్లలేదన్నారు. ఈసారి మాత్రం గట్టిగా అడిగేసరికి ఆ మాటకు కట్టుబడి తాను ఈరోజు తెరాసలో చేరినట్టు చెప్పారు. తెలంగాణ రాష్టాన్ని సాధించిన కేసీఆర్‌ సీఎంగా చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరాయని చెప్పారు. రైతు బీమా, రైతు బంధు, పింఛను, వాటర్‌ గిర్డ్‌, యాదవులకు గొర్రెలు, రైతులకు బర్రెల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలన్నీ పేదలకు చేరాయన్నారు. కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలకే ఓట్లు వచ్చాయని చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ ప్రాజెక్టు రైతుల పక్షాన నిలబడి తాను అనేక లాఠీ దెబ్బలు తిన్నానన్నారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు సరైనవని ప్రజలు తీర్పు ఇచ్చారని, అందువల్ల ఆయన నిర్ణయాలే కరెక్టు అని తాను గ్రహించినట్టు చెప్పారు. అందుకే సీఎం నిర్ణయానికి కట్టుబడి తాను తెరాసలో చేరినట్టు వంటేరు స్పష్టంచేశారు. కేసీఆర్‌ హయాంలో గజ్వేల్‌ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా పనిచేయాలనే కసితోనే గజ్వేల్‌లో పోటీచేశాన న్నారు. సీఎం బరిలో ఉన్నారు ఇంకా తానెక్కడ గెలుస్తానని అనుకోకుండా ఎమ్మెల్యే కావాలన్న తాపత్రాయంతోనే గజ్వేల్‌లో తెరాసతో కొట్లాడినట్టు చెప్పారు. అంతేతప్ప తనకు కేసీఆర్‌ పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఇదివరకే తాను తెరాసలో చేరి ఉంటే ఎంతో బాగుండేదని అభిప్రాయపడ్డారు. తనను తెరాసలోకి ఆహ్వానించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తనకు పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా చిత్తశుద్ధితో పనిచేస్తానని, పార్టీకి, కేసీఆర్‌, కేటీఆర్‌లకు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని వంటేరు అన్నారు. ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.