కుహనా లౌకికవాదులకు చెంపపెట్టులా ప్రణబ్‌ ప్రసంగం

share on facebook

కుటిల,కుత్సిత రాజకీయాలతో దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశంలో సర్వ అవ లక్షణాలకు కారణమని చెప్పడంలో ఎవరూ సందేహించరాదు. వారసత్వ రాజకీయాలను నవనాడుల్లో పునికిపుచ్చుకుని, ఇంకా దానిని కొనసాగించే దిశగా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, దాదాపు ఆరు దశాబ్దాలపాటు దేశాన్ని పాలించినా ఇంకా ఈ దేశంలో గరీబీ హఠావో నినాదాం కొనసాగుతోంది. ధనికులు ధనికులుగా, పేదలు పేదలుగానే ఉండడానికి కాంగ్రెస్‌ అవలంబించిన రాజకీయాలే కారణం. రాజకీయ పార్టీల నేతలు మాత్రమే ధనవంతులయ్యేలా ఈ దేశాన్ని మార్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీది. అధికారంలో తామే ఉండాలన్న ధోరణిలో వంశపారంపర్య రాజకీయాలు కొనసాగిస్తున్న క్యాన్సర్‌ కారక పార్టీ కాంగ్రెస్‌. మధ్యలో మేధావి అయిని పివి నరసింహారావు ఐదేళ్లు పాలన చేసినా ఆయనపై కక్ష తీర్చుకుని,బయటకు సాగనంపిన పార్టీ కాంగ్రెస్‌. మాజీ ప్రధానిగా పివికి గౌరవం ఇవ్వకుండా ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్‌ కార్యాలయంలోకి రాకుండా చేసిన ఘనత ఇటలీ దేశస్థురాలయిన సోనియాదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్‌ అంటే మతకల్లోలాలు. కాంగ్రెస్‌ అంటే మతమార్పిడులు. కాంగ్రెస్‌ అంటే పేదరికాన్ని పెంచి పోషించడం. కాంగ్రెస్‌ అంటే సర్వ దుర్గుణాలు ఉన్న పార్టీగానే చూడాలి. అలాంటి పార్టీ సిక్కుల ఊచకోతను మరచిపోయింది. హైదరాబాద్‌ పాతబస్తీలో అల్లకల్లోలాను మరచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడం మరచిపోయింది. అధికారం కోసం ఎంతకైనా తెగించే పార్టీ అది. రాహుల్‌ తప్ప మరొకరు ఇప్పుడు పార్టీకి అధ్యక్షుడు కాగలడా అన్నది ప్రకటించాలి. రాహులే ఎందుకు అధ్యక్ష స్థానంలో ఉండాలి. మహాత్మా గాంధీ వారసులను ఎందుకు కాంగ్రెస్‌ పార్టీలో ఎదగనీయడం లేదు. లాల్‌బహద్దూర్‌ శాస్త్రి వారసులను ఎందుకు రానీయడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇవ్వడానికి వెళితే ఎందుకు ఉలిక్కి పడుతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమైనా దేశద్రోహ కార్యకలాపాలు చేసిందా? అదేమైనా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యిందా అన్నది కాంగ్రెస్‌ చెప్పాలి. నిజానికి ప్రణబ్‌ దా ఈ సమావేశానికి వెళ్లడం ద్వారా ఓ మంచి సందేశం ఇచ్చారు. కాంగ్రెస్‌ అనుకున్నంత నీచ రాజకీయాలకు పాల్పడే వ్యక్తి ప్రణబ్‌ దా చేయలేరు. ఆయన మాజీ రాష్ట్రపతిగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ పెద్ద మనిషి మాత్రమే. ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను ప్రణబ్‌ తన ప్రసంగంలో గుర్తు చేసి ఉంటే బాగుండేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మహాత్మాగాంధీ హత్య గురించి ప్రణబ్‌ ఎందుకు గుర్తు చేయలేదని ప్రశ్నించారు. సిపిఎం కూడా ఎందుకు ఉలిక్కి పడిందో ప్రజలకు అర్థం కావడం లేదు. గాంధీని చంపింది గాడ్సేనే కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ కాదని ఆయన ఇంకా తెలుసుకోక పోవడం సిపిఎం పిడివాద రాజకీయాలకు పరాకాష్ట. సిపిఎం ఎంతమంది ప్రజలను పొట్టన పెట్టుకుందీ బెంగాల్‌, త్రిపుర, కేరళ చరిత్రను తిరగేస్తే తెలుస్తుంది. భిన్న సంస్కృతుల సమ్మేళనమే నిజమయిన భారత్‌ అని ప్రణబ్‌ తన ప్రసంగంలో పేర్కొనడాన్ని సీపీఐ నేత డి.రాజా స్వాగతించడం ద్వారా హుందాతనం చాటారు. కనీసం ఆ మాత్రం స్పృహ కూడా ఏచూరికి లేకపోవడం విచారకరం. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశానికి ప్రణబ్‌ హాజరు కాకుండా ఉండాల్సిందని భావించిన వారంతా ఆయన ప్రసంగం విన్న తరవాత తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. ఆయన చేసిన ప్రసంగం నిజంగా దేశ ఔన్నత్యాన్ని చాటేలా ఉంది. అందుకే కాంగ్రెస్‌ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రణబ్‌ చేసిన సూచనలు బిజెపి పాటించాలంటూ మెల్లగా సన్నాయి నొక్కులు ప్రారంభించింది. ‘జాతి, జాతీయత, దేశభక్తి అనే ఆలోచనలపై నాకున్న అవగాహన గురించి మాట్లాడడానికి ఈ రోజు విూ ముందుకు వచ్చాను…’ అంటూ ప్రణబ్‌ తనప్రసంగం ప్రారంభించిన తీరు నిజంగానే హుందాతనాన్ని చాటింది. ‘హిందువులు, ముస్లింలు, సిక్కులు వంటి అనేక మతాలు, కులాలకు చెందినవారందరి కలయికే జాతీయతావాదం. ఎవరూ అంతరించిపోకుండా అందరూ కలిసి ఉండాలనేది దీనర్థం. ఘర్షణ, హింస, కోపతాపాల నుంచి దూరంగా జరగాలి… శాంతి, సామరస్యత, ఆనందాల దిశగా కదలాలి. మన మాతృభూమి అదే కోరుతోంది. భరతమాతకు ఇవ్వాల్సింది కూడా ఇదేనంటూ ప్రణబ్‌ చేసిన సూచనలు ఒక్క ఆర్‌ఎస్‌ఎస్‌ కోసం చేసిన హితబోధ కాదు. ఇది కాంగ్రెస్‌ కూడా గుర్తించాలి. కాంగ్రెస్‌ విభజించి పాలించు, సంతుష్టీకరణ రాజకీయాలతో హిందువులను ఈ దేశంలో రెండో తరగతి పౌరులులగా చేసి, మతాంతీకరణలను ప్రోత్సహించిన తీరును మరచిపోలేం. భారతదేశంలో సహనం నుంచే మనకు బలం లభిస్తుంది. బహుళత్వాన్ని మనం గౌరవిస్తాం. భిన్నత్వాన్ని పండుగలా చేసుకుంటాం. అన్నిరకాల భయాందోళన, హింసల నుంచి ప్రజలకు మనం విముక్తి కల్పించాలి’ అని ప్రణబ్‌ చేసిన సూచనలు కాంగ్రెస్‌కు కనువిప్పు కావాలి. జాతీయ వాదమంటే మతంతో, జాతితో ముడిపడిన అంశం కాదన్నారు. విభేదాలను పరిష్కరించుకోవడానికి చర్చలే పరిష్కారమని చెప్పారు. లౌకికవాదం, సమ్మిళితం అనేవి భారతీయుల విశ్వాసాలకు సంబంధించిన విషయాలన్నారు. సహనశీలతే భారతీయత అని ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. బహుళత్వాన్ని అలవర్చుకునే గుణం మన జీవనవిధానంలోనే ఉందని, ఆ భిన్నత్వమే భారతీయతకు పునాది అని చెప్పారు. అసహనం, ద్వేషం, మతదృష్టితో దేశాన్ని నిర్వచించేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమని, అది భారత్‌ అస్తిత్వాన్ని బలహీనపర్చడమే అవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రజల ఆనందంలోనే రాజు ఆనందం, వారి సంక్షేమంలోనే రాజు సంక్షేమం దాగి ఉంటుందని అలనాటి భారతీయ అర్థశాస్త్రవేత్త కౌటిల్యుడు చెప్పిన విషయాలను గుర్తు చేయడం ద్వార భారతీయ సుసంపన్నతను చాటారు. కూతురు శర్మిష్ఠ సహా పలువురు కాంగ్రెస్‌ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నాగ్‌పూర్‌లో రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) మూడో వార్షిక శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకావడం ద్వారా కుహనా లౌకిక వాదులకు గట్టిగా బుద్ది చెప్పారు.

 

Other News

Comments are closed.