‘సీఎం మార్పు’పై తేల్చేయండి

` కర్ణాటక పర్యటన వేళ రాహుల్‌ను కోరిన సిద్ధరామయ్య
` సంక్రాంతి తర్వాత ఇరువురూ ఢల్లీి రావాలన్న కాంగ్రెస్‌ అగ్రనేత
` ఎయిర్‌పోర్టులో రాహుల్‌తో డీకే, సిద్ధరామయ్య కీలక భేటీ
` కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయంపై ఉత్కంఠ
` జనవరి 16న దిల్లీకి వెళ్తాను : డిప్యూటీ సీఎం డీకే
` సీఎం మార్పుపై మేమిద్దరమే మాట్లాడాలి : సీఎం సిద్ధరామయ్య
బెంగుళూరు(జనంసాక్షి):రాహుల్‌ గాంధీ తాజా పర్యటనతో ‘సీఎం మార్పు’ అంశం కర్ణాటకలో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై ఒక్కో వైపు నుంచి ఒక్కో రకం సమాచారం బయటికొస్తోంది. షరా మామూలుగానే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ లేదు లేదు, కాదు కాదు అని మంగళవారం రోజు బదులిచ్చారు. కానీ దీనిపై చర్చించేందుకు సంక్రాంతి తర్వాత దిల్లీకి రావాలని సిద్ధరామయ్య, డీకేలకు రాహుల్‌ సూచించారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి. ఈనేపథ్యంలో బుధవారం కర్ణాటక డిప్యూటీ సీఎం స్వరం మార్చారు. జనవరి 16న దిల్లీకి వెళ్తున్నానని ప్రకటించారు. సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ, దీనిపై మాట్లాడే అధికారం తనకు, డీకేకు మాత్రమే ఉందన్నారు. ఇంతకీ కన్నడ నాట ఏం జరగబోతోంది? కాంగ్రెస్‌ హైకమాండ్‌ మనసులో ఏముంది? సిద్ధరామయ్య, డీకే వ్యాఖ్యలు ఇస్తున్న సంకేతాలు ఏమిటి? ఈ కథనంలో చూద్దాం.
క్లారిటీ కోరిన సీఎం, డిప్యూటీ సీఎం?
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో కర్ణాటకలోని మైసూరులో ఉన్న మండకల్లి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్వాగతం పలికారు. కొన్ని నిమిషాల పాటే ఆ ఎయిర్‌పోర్టులో రాహుల్‌ ఉన్నారు. ఈ అతి స్వల్ప వ్యవధిలోనే రాహుల్‌ ఎదుట సీఎం మార్పు అంశాన్ని సిద్ధరామయ్య, డీకే ప్రస్తావించారనే టాక్‌ వినిపిస్తోంది. దీనిపై ఊహాగానాలకు ముగింపు పలికేలా క్లారిటీని ఇవ్వమని వారు కోరారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపైనా దిశానిర్దేశం చేయమని రాహుల్‌ను సీఎం కోరినట్లు సమాచారం. ఈ అంశాలపై చర్చించడానికి సంక్రాంతి తర్వాత దిల్లీకి రావాలని సీఎం, డిప్యూటీ సీఎంలకు రాహుల్‌ సూచించారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం నిర్దిష్ట తేదీని రాహుల్‌ చెప్పలేదని పేర్కొన్నాయి. ఈ స్వల్ప మంతనాలు ముగిసిన వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో తమిళనాడులోని గుడలూర్‌కు రాహుల్‌ గాంధీ వెళ్లారు.
రాహుల్‌ను రెండోసారి కలిసిన డీకే
దిల్లీకి తిరిగి వెళ్లేందుకు మంగళవారం సాయంత్రంకల్లా గుడలూర్‌ నుంచి మండకల్లి విమానాశ్రయానికి హెలికాప్టర్‌లో రాహుల్‌ చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయనతో డిప్యూటీ సీఎం డీకే కాసేపు సంభాషించారు. విమానాశ్రయంలో రాహుల్‌, డీకే మాట్లాడుకున్న ఫొటోలు కర్ణాటక అధికార పక్షంలో సంచలనం సృష్టించాయి. ఇంతకీ వారు ఏం చర్చించారు ? డీకే ఏం అడిగారు? రాహుల్‌ ఏం చెప్పారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ తర్వాత ప్రత్యేక విమానంలో దిల్లీకి రాహుల్‌ వెళ్లిపోయారు.
జనవరి 16న దిల్లీకి వెళ్తాను : డిప్యూటీ సీఎం డీకే
ఈ పరిణామంపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 16న తాను దిల్లీకి వెళ్తున్నట్లు వెల్లడిరచారు. తాను కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడి హోదాలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో జరిపిన సమావేశాలు, చర్చల వివరాలను బయటికి చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విూటింగ్‌లన్నీ కాంగ్రెస్‌ పార్టీ ప్రొటొకాల్‌ ప్రకారం జరుగుతాయన్నారు. సీఎం మార్పు అంశంపై రాహుల్‌, తాను అస్సలు డిస్కస్‌ చేయలేదన్నారు. జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ చట్టం పేరును మార్చడం, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధి, స్థానిక రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలపై చర్చించామని డీకే తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు పనితీరు బాగానే ఉందని, అలాగే పనిని కొనసాగించమని రాహుల్‌ సూచించారన్నారు.
సీఎం మార్పుపై మేమిద్దరమే మాట్లాడాలి : సీఎం సిద్ధరామయ్య
డీకే తాజా వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య బుధవారం స్పందించారు. సీఎం మార్పు అంశంపై మాట్లాడే అధికారం తనకు లేదా ఉప ముఖ్యమంత్రి డీకేకు మాత్రమే ఉందన్నారు. దీనిపై ఎమ్మెల్యేల కంటే విూడియానే ఎక్కువగా చర్చిస్తోందని ఆయన మండిపడ్డారు. దీనిపై కొంతమంది అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇటీవలే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పరిస్థితి గురించి వారికి పూర్తిగా అవగాహన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పంపిణీపై విభేదాలు లేవని, ఈ ఊహాగానాలన్నీ విూడియా సృష్టేనని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మంగళవారం రోజు రాహుల్‌ గాంధీతో ఎటువంటి రాజకీయ చర్చలు జరపలేదన్నారు. తద్వారా కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశాలే తనకు శిరోధార్యం అనే సంకేతాన్ని సిద్ధరామయ్య ఇచ్చారు.
సంక్రాంతి తర్వాతే దిల్లీకి డీకే, సిద్ధు
దిల్లీకి రావాలని కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు రాహుల్‌ గాంధీ సూచించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అశోక్‌ పట్టన్‌ బుధవారం బెంగళూరులో వెల్లడిరచారు. అయితే ఏ తేదీన వారిద్దరితో కాంగ్రెస్‌ పెద్దలు భేటీ అవుతారు అనేది నిర్దిష్టంగా తెలియదన్నారు. డేట్‌ ఫిక్స్‌ అయ్యాక సిద్ధరామయ్య, డీకే దిల్లీకి వెళ్తారన్నారు. సంక్రాంతి తర్వాతే ఈ డేట్‌ ఫిక్స్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని అశోక్‌ పట్టన్‌ పేర్కొన్నారు. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారని, ఆశావహుల జాబితాలో తాను కూడా ఉన్నానని ఆయన తెలిపారు.
కాంగ్రెస్‌ ఏం చేయబోతోంది?
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గతంలో కీలక వ్యాఖ్య చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్చలు జరిపే తేదీని ముందే బహిర్గత పర్చలేమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు పార్టీ హైకమాండ్‌ నేరుగా వారిని పిలిచి మాట్లాడుతుందన్నారు. దిల్లీకి వచ్చి కలవాలని రాహుల్‌ గాంధీ కూడా డీకే, సిద్ధరామయ్యలకు సూచించారనే టాక్‌ వినిపిస్తోంది. తద్వారా సీఎం మార్పుపై చర్చలకు తాము సిద్ధమనే సంకేతాలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ పంపుతోంది. సామరస్యంగా, లౌక్యంతో దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు దీనిపై డీకే శివకుమార్‌ పట్టు వీడటం లేదని తేటతెల్లం అవుతోంది. చెరో రెండున్నర ఏళ్లపాటు సీఎం పదవి పంపకంపై 2023లో తనకు ఇచ్చిన హావిూని నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. 2025 నవంబరు 20 నాటికే కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారు రెండున్నర ఏళ్ల పాలనా కాలాన్ని పూర్తి చేసుకుంది. నాటి నుంచే సీఎం మార్పు అంశంపై రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఈ ఏడాది దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

 

ప్రయత్నాలు విఫలమైనా.. ప్రార్థనలు విఫలం కావు
` డీకే శివకుమార్‌ ఆసక్తికర పోస్ట్‌
బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగనుందంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సామాజిక మాధ్యమం ’ఎక్స్‌’లో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. ’ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రార్ధనలు విఫలం కావు’ అంటూ ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని మైసూరులో మంగళవారంనాడు డీకే కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన తాజా పోస్ట్‌ ఆసక్తిని రేపుతోంది. శివకుమార్‌ పోస్ట్‌ కీలకమైన రాజకీయ సంకేతంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడు తున్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన ఆకాంక్షను డీకే శివకుమార్‌ చాలాకాలం క్రితమే వ్యక్తం చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని సిద్ధరామయ్య చెబుతూ వస్తున్నారు.తమిళనాడు నుంచి రాహుల్‌ తిరిగి వస్తూ మైసూరు విమానాశ్రయంలో దిగినప్పుడు డీకే శివకుమార్‌, సిద్ధరామయ్యతో ఆయన వేర్వేరుగా కొద్దిసేపు ముచ్చటించారు. రాహుల్‌ తమిళనాడులోని నీలగిరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఢల్లీికి వెళ్తూ మైసూరులో ఆగారు. అయితే ముగ్గురు నేతలు మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయనేది మాత్రం బయటకు రాలేదు. గత నెలలో రాహుల్‌ను కలిసేందుకు శివకుమార్‌ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. శివకుమార్‌ బుధవారంనాడు షేర్‌ చేసిన పోస్ట్‌ వెనుక ఉద్దేశం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. డీకేను కొద్ది కాలం ఆగాల్సిందిగా రాహుల్‌ గాంధీ చెప్పి ఉండవచ్చని, దీనిపై సమగ్రంగా చర్చించేందుకు త్వరలోనే ఇద్దరినీ ఢల్లీికి పిలుస్తానని రాహుల్‌ సూచించి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే రాహుల్‌తో సంభాషణల్లో ఎలాంటి రాజకీయ ప్రస్తావన చోటు చేసుకోలేదని సిద్ధరామయ్య తెలిపారు. పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని, ఊహాగానాలన్నీ విూడియా సృష్టేనని అన్నారు. 2023 మేలో ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం పోస్టు విషయంలో సిద్ధరామయ్య, డీకే మధ్య గట్టిపోటీ తలెత్తింది. అయితే అధిష్ఠానం డీకేకు నచ్చచెప్పి ఆయనను ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే రొటేషనల్‌ పద్ధతిలో సీఎం పదవిని పంచుకునేందుకు ఒక రాజీ ఫార్ములా అప్పట్లో కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం సిద్ధూ రెండున్నరేళ్ల పాలన అనంతరం డీకే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందం జరిగినట్టు పార్టీ అధికారికంగా ఇంతవరకు ధ్రువీకరించలేదు.