పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం

– ధరల పెరుగుదల ప్రభుత్వాలకు పట్టడంలేదు
– మద్యం విక్రయాలపై నియంత్రణ తేవాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సిద్దిపేట, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌ సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉల్లిగడ్డ ధరలతో సహా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు బంధు పథకం కింద రైతులకు ఖరీఫ్‌ సహాయాన్ని త్వరగా అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు పర్మిట్లు ఇవ్వడంతో మద్యానికి బానిసలైన యువకులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆరేళ్ల పాలనలో కేవలం మాటలతోనే ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తామంటూ అన్ని వర్గాలకు ఆశలు చూపుతూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమస్యలను ఎవరికి తెలియజేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తన తీరును మార్చుకోవాలని, రాబోయే కాలంలో ప్రజల అవసరాలకు గుణంగా పాలన సాగించాలని వెంకటరెడ్డి సూచించారు. లేకుంటే ప్రజా సమస్యల పరిష్కారంపై సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు.