భగవద్గీత అలవాటైతే..

జగత్తులోని ప్రతీ ఒక్కరూ జగన్నాథుడవుతాడు..
– వేణుగోపాలస్వామి ప్రధాన అర్చకులు శేషాచార్యులు

చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : భగవద్గీత అలవాటైతే జగత్తులోని ప్రతి ఒక్కరూ జగన్నాథుడవుతాడని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు మంగళగిరి శేషాచార్యులు అన్నారు. ఆదివారం గీతా జయంతిని పురస్కరించుకుని కోవెలలో 18 అధ్యాయాలను భగవద్ బంధువులు అందరి చేత పటింపజేసి భగవద్గీత యొక్క తత్వాన్ని సారాన్ని ఆయన వివరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వమతాల సారం సకల జీవుల జీవన మార్గం సర్వజన ఆమోదయోగ్యం అయినటువంటి భగవద్గీత మహాగ్రంధం ప్రతి ఒక్కరూ చదివి వారిలో దాగివున్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని బాధలను పాపాలను పగలను కక్షకార్పణ్యాలను తొలగించుకోవచ్చని ఇది కేవలం చనిపోతే వినిపించే గానం గ్రంథం కాదని బతికున్నప్పుడే దాని సారం తెలుసుకొని మనల్ని పుట్టించిన ఆ భగవంతుడి యొక్క రుణం తీర్చుకోవడానికి ఏకైక సాధనమని అందుకే భగవద్గీత అనేది కులమతాలకు అతీతంగా వయోభేదాలు లేకుండా అందరూ చదవడానికి ఉపయోగకరమైనదని గీతాపటనాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలని అప్పుడే మనిషి లోపల ఉన్న ఉన్నతమైన గుణాలు ప్రస్ఫుటమవుతాయని మనిషే దేవుడుగా మారుతాడని అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురు అయ్యాడని భగవద్గీత అలవాటైతే జగత్తులోని ప్రతి ఒక్కరూ జగన్నాథుడవుతాడని శేషాచార్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి రామచంద్ర మూర్తి, రాజు, స్వామి, సరోజని,పద్మ, సరిత, లలిత తదితరులు పాల్గొన్నారు.