అధిక జనాభా నియంత్రించండి- అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి

సంగారెడ్డి, జూలై 10 : అధిక జనాభా నియంత్రించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు సమీకృత కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రిచినప్పుడే దేశం అభివృద్ధి చెంది నాణ్యమైన జీవనం గడపడానికి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు అన్నారు. దేశంలో జనాభా 121 కోట్లు అయితే రాష్ట్ర జనాభా 8.46 కోట్లపైన ఉందని తెలిపారు. దేశస్వాతంత్య్రానంతరం గణనీయమైన అభివృద్ధి సాధించిన పెరుగుతున్న జనాభాకు కావాల్సిన సౌకర్యాలు పెరుగవని తెలిపారు. దేశంలో ఎన్నోప్రాజెక్టులు, కర్మాగారాలు, ఆర్థిక ప్రగతిని సాధించామన్నారు. శరవేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలు తీరటం లేదన్నారు. 2010 చట్టం ప్రకారం స్త్రీలకు 18, పురుషులకు 25 సంవత్సరాలకు పెళ్లి వయస్సు నిర్ణయించారని తెలిపారు. అయిన మెదక్‌ జిల్లాలో 30శాతం బాల్య వివాహాలు జరగడం దురదృష్టకరమన్నారు. బాల్యవివాహాల సంఖ్య తగ్గించడానికి కృషి చేస్తామన్నారు. తొలి కాన్పు తర్వాత మలి కాన్పుకు ఎడమ 3 సంవత్సరాలు ఉండాలని నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో కాన్పులు అధికంగా జరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి రంగారెడ్డి, డిపిఓ జగన్నాథరెడ్డి, డిపిఎం వసంత్‌రావు, డిపిఆర్‌ఓ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.