ఆక్టోబర్‌లో ఆంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సు

కలెక్టర్‌ నీతూప్రసాద్‌
కాకినాడ,ఆగష్టు2,: అక్టోబరులో హైదరాబాద్‌లో అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ పేర్కొన్నారు. కాకినాడ సామాజిక అటవీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 63వ వనమహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ముఖ్య అతిధిగా హాజరై మొక్కలను నాటారు. కాకినాడ ప్రభుత్వ ఐటిఐలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారుల్లో జంతు సంరక్షణ, మొక్కల పెంపకంపై అవగాహన కలిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతి చిన్నారి పుట్టిన రోజునాడు ఐదు మొక్కలను నాటి వాటి సంరక్షణను చేపట్టాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం ద్వారా భూతాపాన్ని తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గింవచ్చన్నారు.అంతేగాక వర్షాలు సకాలంలో పడటానికి, భూమి వేడెక్కకుండా ఉండటానికి, భూమి కోతను నివారించడానికి, జలాశయాల్లో మట్టి పూడిక కాకుండా నివారించడానికి మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటడాన్ని అలవాటు చేసుకుని జిల్లాను పచ్చని గోదావరిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 32 శాతం అడవులు ఉన్నాయని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు దీనిని మరింత పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి పిఎస్‌ రాఘవయ్య మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి విధిగా మొక్కలు నాటడం, సంరక్షించడం అలవాటుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అడవులు తగ్గిపోవడం, పెరుగుతున్న పారిశ్రామికీకరణ వంటి కారణాలతో భూమిపై రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి మంచు ప్రాంతాల్లోని మంచు కరిగిపోయి సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతమంతా జలమయమయ్యే పరిస్థితులు కలుగుతున్నాయన్నారు. చెట్ల వల్ల అనేక లాభాలు ఉన్నప్పటికీ చిన్నచూపుతో వాటిని విచక్షణా రహితంగా వాటిని నరికేయడంతో కాలుష్యం పెరిగి భూతాపం పెరిగి అనేక జీవరాశులు నశిస్తాయన్నారు. కాకినాడ సామాజిక అటవీ విభాగం డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి సివి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 63వ వనమహోత్సవాన్ని పురస్కరించుకుని రెండు మిలియన్ల మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో లక్షా 2వేల 700 మొక్కలను జిల్లాలో ఎంపిక చేసిన పన్నెండు ప్రాంతాల్లో నాటుతున్నామన్నారు.