హైదరాబాద్‌లో మరో రెండు ఐటి పార్కులు
హైటెక్ సిటీ తరహాలో నిర్మిస్తాం
వందకోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన ‘డ్యూ’ సాప్ట్‌వేర్ కంపెనీ
ప్రతినిధులతో చర్చించిన ఐటిశాఖ మంత్రి శ్రీధర్ బాబు
ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు గత పదేళ్లలో ఎప్పుడూ రాలేదని వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి):నగర శివారుల్లో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. హైటెక్ సిటీ తరహాలోనే కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్ లో రూ.100కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ’డ్యూ’ సాప్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీ రంగంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. . వీటిని ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలి? నగర శివారుల్లో ఏయే ప్రాంతాలు ఇందుకు అనుకూలంగా ఉన్నాయో సంబంధిత యంత్రాంగం అధ్యయనం చేస్తోందని తెలిపారు. ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఎక్కడి నుంచైనా ఈ పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాప్ట్ వేర్ కంపెనీలకు అవకాశం కల్పిస్తామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటి వరకు ప్రత్యేక పాలసీ అంటూ ఏదీ లేదని, దీని వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అందుకే ప్రత్యేక పాలసీ రూపొందిం చాలని నిర్ణయించామని, పెట్టుబడితో పాటు కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తా మని శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాప్ట్ వేర్ కంపెనీని సంతోషంగా ఆహ్వానిస్తున్నామని, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. రాబోయే అయిదేళ్లలో ఈ సంస్థ 900 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనుందని పేర్కొన్నారు.
ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు గత పదేళ్లలో ఎప్పుడూ రాలేదు
ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కేపబిలిటీ ఉందని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విూడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘ఏపీకి కోస్తా ప్రాంతం.. అపార వనరులు ఉన్నాయి. ఆ రాష్ట్రానికి మంచి పరిశ్రమలు వస్తాయి.. పలు కంపెనీలతో ఎంవోయూలు కూడా చేసుకున్నారు. ఎంవోయూల వివరాలు ఏపీలోనే ప్రకటిస్తామని దావోస్‌లో లోకేశ్ చెప్పారు. ఏపీకి అనుకూలతలు, పెట్టుబడుల సాధనకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయి. హైదరాబాద్ కంపెనీలు ఏపీకి తీసుకెళ్లి ఇక్కడ ఆటంకాలు సృష్టించే ఆలోచనలో చంద్రబాబు లేరు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. వచ్చే మూడేళ్లలో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశముంది. పదేళ్లలో రాష్ట్రానికి ఇప్పుడు వచ్చినన్ని పెట్టుబడులు ఎప్పుడూ రాలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తాం. ట్రిపుల్ ఆర్ చుట్టూ ఐటీ విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చే యోచనలో సర్కార్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ వయసు పెంచే ఆలోచన లేదు. తెలంగాణలో రెండు డ్రై పోర్టులు రానున్నాయి. రెండోశ్రేణి నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు, ఐటి అభివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీని నాలుగేళ్లలో అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ తూర్పు వైపు ఐటీని అభివృద్ధి చేస్తాం. ఎవరు అధికారంలో ఉన్నా అప్పటికే ఉన్న పాలసీలు ముందుకు తీసుకెళ్లాలి. మన్మోహన్ సింగ్ తెచ్చిన పాలసీలు మోదీ తీసుకొని పోతున్నారు. పాలసీలను ముందుకు తీసుకు వెళ్లనిది.. ఏపీలో జగన్ మాత్రమే’’ అని శ్రీధర్‌బాబు అన్నారు.