దంచికొడుతున్న ఎండలు..
ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు
ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు, ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయని.. 32 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. హైదరాబాద్, నిజామాబాద్, హనుమకొండ, మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది. మరో వారం రోజులపాటు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ లేదా ఫ్యాన్లు, కూలర్ల కింద ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి చేరకుండా కర్టెన్లు ఉపయోగించాలి.
వదులుగా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. ఇవి చెమటను పీల్చి శరీరం చల్లబడేటట్లు చేస్తాయి. ఉదయం 10 తర్వాత మధ్యాహ్నం 3 లోపు ఎండలో తిరగకపోవటమే మంచిది. ఒకవేళ అత్యవసర పనిపై బయటకు వెళ్తే.. గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలి.
ఇంట్లో ఉన్నా.. తరచూ నీరు తాగాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా లభించి వడదెబ్బ బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 4 లీటర్లు నీరు తాగాలి. ఎండలో పని చేసేవారు మరో లీటరు అదనంగా తీసుకోవాలి.
వేసవిలో కలుషిత నీళ్ల ముప్పు అధికం. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం సరికాదు. బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి నీళ్ల బాటిల్ తీసుకెళ్లటం ఉత్తమమైన పని. తాజాగా వండిన ఆహారం తీసుకోవడంతో పాటు బయట తినడం మానుకోవాలి.
మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే డీహైడ్రేషన్ వల్ల బీపీ తగ్గి ఉంటుంది. ఈ సమయంలో బీపీ మందులు వేసుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది. బీపీ రోగులు డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండాకాలంలో మద్యం శరీరానికి మరింత మప్పు చేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉంటే మేలు. వేడి చేసి చల్లార్చిన నీటిలో ORS కలుపుకొని తాగడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవచ్చు.