ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి..
న్యూఢల్లీి(జనంసాక్షి):బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వచ్చింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీ ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 27ని ఉత్తరాఖండ్‌లో యూసీసీ డేగా జరుపుకోనున్నట్లు సీఎం ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందింది. 2024, మార్చి 11 ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని ఈ ఏడాది జనవరిలో పూర్తిగా అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు. కాగా, పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది.