ఆధునాతన భవనంలోకి ఎస్పీ కార్యాలయం

శ్రీకాకుళం, జూలై 28 : ఆధునిక హంగులతో నిర్మించిన భవనంలోకి జిల్లా పోలీసు కార్యాలయం మారనుంది. మూడు కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. ప్రజలు నేరుగా ఎస్పీని కలిసేందుకు వీలుగా ఈ భవనంలో ప్రత్యేక విభాగాన్నిమ ఏర్పాటు చేశారు. సెలర్లు పార్కింగ్‌, హోంగార్డు ఆర్‌ఐ, ఎఆర్‌డిఎస్పీ కార్యాలయాలు, స్టోర్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం, సెంట్రల్‌ ఫిర్యాదుల విభాగాలు ఉండగా, మొదటి అంతస్తులో ఎస్పీ ఛాంబర్‌, కాన్ఫరెన్స్‌ హాలు, ఎఎస్పీ, ఓఎస్‌డి కార్యాలయాలు, డిసిఆర్‌బి, కంప్యూటర్‌ సెక్షన్‌, సిసి గదులను నిర్మించారు. రెండో అంతస్తులో ఎ,బి,పి సెక్షన్లు, రికార్డుల గది, అడ్మినిస్ట్రేట్‌ కార్యాలయం, కమ్యూనికేషన్‌ విభాగాలు, మూడవ అంతస్తులో సిబ్బంది విశ్రాంతి గది నిర్మించారు. భవనం మొత్తం గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ చేశారు. కలపతో కూర్చిలను, బెంచీలను ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భవనం చుట్టూ ప్రక్కల మొక్కలను వేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు.