ఆమ్లా అరుదైన రికార్డ్‌ వన్డేల్లో 3 వేల పరుగులు పూర్తి

సౌతాంప్టన్‌,ఆగష్ట్‌ 29 – :దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా సరికొత్త రికార్డ్‌ సృష్టించాడు. ప్రపంచ వన్డే క్రికెట్‌లో వేగంగా మూడు వేల పరుగులు అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇంగ్లాండ్‌తో సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా ఆమ్లా ఈ ఘనత సాధించాడు. 124 బంతుల్లో 16 ఫోర్లతో 150 పరుగులు చేసిన ఆమ్లా కెరీర్‌లో ఇది పదో శతకం. ఈ సఫారీ క్రికెటర్‌ 57వ ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకూ వివ్‌రిచర్డ్స్‌ పేరిట ఈ రికార్డు ఉండేది. రిచర్డ్స్‌ 69 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగుల మైలురాయి అందుకుంటే…. ఆమ్లా మరో 12 ఇన్నింగ్స్‌ల ముందే అందుకోవడం విశేషం. వేగంగా మూడు వేల పరుగులు పూర్తి చేసుకున్న టాప్‌ టెన్‌ ఆటగాళ్ళ జాబితాలో ఆమ్లా మూడో దక్షిణాఫ్రికా క్రికెటర్‌. ఇంతకుముందు గ్యారీ కిరిస్టెన్‌ 72 ఇన్నింగ్స్‌లలోనూ , డిపెనార్‌ 79 ఇన్నింగ్స్‌లలోనూ పూర్తి చేసుకున్నారు.
వన్డేల్లో వేగంగా 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ళు ః
1. హషీమ్‌ ఆమ్లా – సౌతాఫ్రికా – 57 ఇన్నింగ్స్‌లు
2. వివ్‌ రిచర్డ్స్‌ – వెస్టిండీస్‌ – 69 ఇన్నింగ్స్‌లు
3. గోర్డాన్‌ గ్రీన్‌రిడ్జ్‌ – వెస్టిండీస్‌ – 72 ఇన్నింగ్స్‌లు
4. గ్యారీ కిరిస్టెన్‌ – సౌతాఫ్రికా – 72 ఇన్నింగ్స్‌లు
5. విరాట్‌ కోహ్లీ – భారత్‌ – 72 ఇన్నింగ్స్‌లు
6. గ్రాహం గూచ్‌ – ఇంగ్లాండ్‌ – 77 ఇన్నింగ్స్‌లు
7. కెవిన్‌ పీటర్సన్‌ – ఇంగ్లాండ్‌ – 78 ఇన్నింగ్స్‌లు
8. నవజ్యోత్‌సింగ్‌ సిధ్ధు – భారత్‌ – 79 ఇన్నింగ్స్‌లు
9. బ్రయాన్‌ లారా – వెస్టిండీస్‌ – 79 ఇన్నింగ్స్‌లు
10. బోథా డిపెనార్‌ – సౌతాఫ్రికా – 79 ఇన్నింగ్స్‌లు