ఆయుర్వేద వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం
-టి ఎస్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి
జగదేవ్ పూర్, సెప్టెంబర్ 9 (జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా మరో బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భారతీయ వైద్య విధానాలపై, పల్లె ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఆయుష్ గ్రామ కార్యక్రమాన్ని చేపట్టారని వెల్లడించారు. శుక్రవారం జగదేవ్ పూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో ఆయుష్ అవగాహన కార్యక్రమానికి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయుష్ కరదీపికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ అవగాహన బృందంలో 50 మంది ఉంటారని గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారన్నారు. ఆయుర్వేద, యునాని, హోమియో, యోగ, ప్రకృతి వైద్య విధానాలను ప్రజల మరింత చెరువ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు ప్రజలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ గుప్తా, ఆయుర్వేద వైద్యురాలు దీపాంజలి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బిక్షపతి, పిఎసిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, కొండపోచమ్మ డైరెక్టర్ జానకి రాములు, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు స్వామి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు స్వామి, అంగన్వాడి టీచర్లు ఆశావర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.