ఆరు ర్యాంపులకు 51 మంది టెండర్లు

శ్రీకాకుళం, జూలై 23 : జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో 6 ఇసుక ర్యాంపులకు నిర్వహించిన టెండర్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 51 మంది టెండర్లు వేశారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు, శ్రీకాకుళం మండలం కల్లేపల్లి, కిల్లిపాలెం, బట్టేరు, నరసన్నపేట మండలం గోపాలపెంట క్వారీల్లో ఇసుక తవ్వకాల కోసం అధికారులు టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మొత్తం 81 మంది దరఖాస్తులను కొనుగోలు చేయగా 51 మందే ధరావతు చెల్లించారు. పొన్నాడ ర్యాంపు కోసం 14 మంది దరఖాస్తు కొనుగోలు చేయగా 9 మందే టెండర్లు వేశారు. బొంతలకోడూరుకు తొమ్మిది మంది దరఖాస్తు కొనగా ఐదుగురు, కల్లేపల్లి ర్యాంపునకు 10 మంది, కిల్లిపాలెం ర్యాంపునకు 10 దరఖాస్తులు కొనగా నలుగురు, గోపాలపెంటకు 21 మంది దరఖాస్తులు కొనగా 10 మంది, బట్టేరుకు 22 మంది దరఖాస్తులు కొనగా 13 మంది టెండర్లు వేశారు. వీటిని ఈ నెల 25న స్థానిక జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో తెరవనున్నారు. టెండర్లు తెరిచే ప్రక్రియ ఇసుక వేలం కమిటీ ఛైర్మన్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.భాస్కర్‌ సమక్షంలో జరగనుంది. ఈ విషయాన్ని గనుల శాఖ ఏడీ ఆర్‌.గొల్ల తెలిపారు. కాగా అదే రోజు బహిరంగ సమావేశం కూడా నిర్వహించనున్నారు.