మహిళలకు అగ్రతాంబూలం

` అన్ని రంగాల్లో అతివలదే పైచేయి
` రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి, దేశ ఐక్యతకు పునాది
` రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
న్యూఢిల్లీ(జనంసాక్షి):రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ నిబంధనల ద్వారా జాతీయ స్ఫూర్తికి, దేశ ఐక్యతకు బలమైన పునాదిని వేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. దేశ ప్రజలమైన మనం స్వదేశంలో, విదేశాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకోబోతున్నామని స్పష్టం చేశారు. సోమవారం దేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ద్రౌపదీ ముర్ము ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు.భారతీయ మహిళలు సంప్రదాయ మూస పద్ధతులను బద్దలు కొట్టి ముందుకు సాగుతున్నారని ద్రౌపదీ ముర్ము కొనియాడారు. నారీమణులు దేశ సర్వతోముఖాభివద్ధికి చురుకుగా తోడ్పడుతున్నారని వెల్లడించారు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు, స్వయం ఉపాధి నుంచి సాయుధ దళాల వరకు ప్రతి రంగంలోనూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని తెలిపారు. క్రీడా రంగంలోనూ టీమ్ ఇండియా ఒమెన్ క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పారని గుర్తు చేసుకున్నారు.”గతేడాది నవంబర్‌లో టీమ్ ఇండియా మహిళా క్రికెటర్లు ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను, ఆ తర్వాత బ్లైండ్ మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుని క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. గత సంవత్సరం చెస్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఇద్దరు భారతీయ మహిళల మధ్య జరిగింది. ఈ ఉదాహరణలు క్రీడా ప్రపంచంలో భారత్‌కు చెందిన నారీమణుల ఆధిపత్యానికి నిదర్శనం. దేశ ప్రజలు వారిని చూసి గర్విస్తున్నారు. పంచాయతీ రాజ్ సంస్థలలో మహిళా ప్రతినిధుల సంఖ్య దాదాపు 46 శాతంగా ఉంది. మహిళల రాజకీయ సాధికారతను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ‘నారీ శక్తి వందన్ అధినియం’ మరింత బలాన్ని ఇస్తుంది. వికసిత భారత్ నిర్మాణంలో నారీ శక్తి పాత్ర కీలకమైనది” అని ముర్ము అన్నారు.