యూరప్ తనపై యుద్ధానికి తానే నిధులు సమకూరుస్తోంది

` భారత్`ఈయూ వాణిజ్య ఒప్పందం వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్(జనంసాక్షి):భారత్, యురోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ.. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు విషయంలో తాము భారత్‌పై 25 శాతం సుంకాలు విధించామని, కానీ యురోపియన్లు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. భారత్ నుంచి శుద్ధి చేసిన రష్యన్ చమురు ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఐరోపా తనపై యుద్ధానికి తానే నిధులు సమకూరుస్తోందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.“రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం సుంకాలను విధించాం. కానీ.. ఏం జరిగిందో చూశారా? యురోపియన్లు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు. రష్యన్ చమురు తొలుత భారత్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని ఐరోపావాసులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నారు” అని బెసెంట్ పేర్కొన్నారు.దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉక్రెయిన్` రష్యా యుద్ధానికి తెరపడుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఐరోపా దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని చెప్పారు. అయితే, ఆ త్యాగాలేంటో ఆయన వెల్లడించలేదు.భారత్` ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఈయూ నేతలు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్, యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలు మంగళవారం ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నారు. మరోవైపు.. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు బెసెంట్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. “రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించుకుంది. అది భారీ విజయం. చమురు విషయంలో ఇప్పటికీ టారిఫ్‌లు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని అనుకుంటున్నాను” అని సుంకాల తొలగింపు ఎత్తివేత గురించి పరోక్షంగా వెల్లడించారు.