ఆర్థిక ప్రగతికి విద్యే మూలం: దగ్గుబాటి

గుంటూరు, జూలై 29 : ఆర్థిక ప్రగతికి విద్యే మూలమని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. విజ్ఞాన్‌ వైజయంతి డాక్టర్‌ లావు రత్తయ్య గారి షష్టిపూర్తి ఉత్సవాలలో రెండవ రోజు సోమవారం ‘సమగ్ర సంపూర్ణ జాతి నిర్మాణం… స్ఫూర్తి ప్రదాతలు’ అనే అంశంపై కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావుగారు ప్రసంగిస్తూ మూడు దశాబ్దాలుగా విద్య ద్వారా సమాజ ప్రగతికి కృషి చేసిన రత్తయ్యగారు 60వ సంవత్సరం వేడుకను జరుపుకోవడం అర్హతతో కూడినదని అన్నారు. 27సంవత్సరాల క్రితం రత్తయ్యగారితో పరిచయమై విద్యాసంస్థలు ప్రైవేట్‌ రంగంలోకి రావడానికి కృషి చేశానని, ఆంధ్రప్రదేశ్‌ కూడా మన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రా కంటే విద్యారంగంలో ముందంజలో వుండేదని తెలిపారు. 11వ బడ్జెట్‌లో 19శాతం విద్యకే కేటాయించారని చెప్పారు. ముఖ్యఅతిథి కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 26సంవత్సరాల క్రితం నలుగురు వ్యక్తుల సహకారంతో స్థాపించిన విజ్ఞాన్‌ సంస్థ 46 వేల మందితో వెలుగొందుతుందని రత్తయ్యగారి నిరంతర కృషి, విశ్వాసం, దీనికి కారణమని అన్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది సంస్థలను కూడా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఎల్‌. లావు రత్తయ్యగారి జీవిత విశేషాలతో కూడిన ‘విజ్ఞాన్‌ వైజయంతి’ పుస్తక ఆవిష్కరణ కన్నా, డాక్టర్‌ దగ్గుబాటి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. శేషగిరిరావు కన్నాని, డాక్టర్‌ దగ్గుబాటిలను దుశ్వాలువాతో సన్మానించారు. విజ్ఞాన్‌ వైజయంతి ఉపాధ్యక్షులు శేషగిరిరావు తమ స్వాగతోపన్యాసంలో విద్యాప్రణాళిక విద్యాభివృద్ధికి మెదడువంటిదన్నారు. విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ గోవర్థనరావు మాట్లాడుతూ ఇక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా విశ్వవిద్యాలయంలో టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, మెకట్రానిక్స్‌ కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కూర్మనాథ్‌ తమ ప్రసంగంలో రత్తయ్యగారు విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు ఉపాధ్యాయులను కూడా తీర్చిదిద్దారని తమ ఎదుగుదలతో పాటు ఇతరుల ఎదుగుదలను ప్రోత్సహించారని చెప్పారు. డాక్టర్‌ ఎల్‌. రత్తయ్యగారు తనను అభినందించిన వారికి సమాధానం చెబుతూ…రత్తయ్యగారితో మొట్టమొదటి నుండి ఉన్న వారి సహచరులు రామమోహన్‌రావు, రావుప్రసాద్‌లకు యం.చౌదరిబాబు అభినందనలను తెలియచేయగా, హరనాథ్‌రెడ్డి, భసవపున్నయ్య, కె.సాంబశివరావు, రత్తయ్యగారిని సత్కరించారు. విజ్ఞాన్‌ సంస్థలలో పనిచేసే అధ్యాపక ఇతర సిబ్బంది షష్టిపూర్తి సందర్భంగా ఘనంగా రత్తయ దంపతులను సన్మానించారు. విజ్ఞాన్‌ కార్యనిర్వహక సంఘ కార్యదర్శి సి.ఆర్‌.రాము, సభ్యులు, సి.జి.కూర్మనాధ్‌, అధ్యక్షులు, ఎమ్‌. చలపతిరావు, కన్వీనర్‌ పివి శంకరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.