ఇంకెపుడు ఇస్తరు మా తెలంగాణ…

తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, వివిధ పోరాట సంఘాల ఫలితంగా హోంశాఖ మంత్రి చిదంబరం 2009 డిసెంబర్‌ ప్రకటన వెలువడింది. దశాబ్దాల తమ పోరాటం ఫలించిందనీ, తమ ఆశ నెరవేరనున్నదని సంబరపడ్డారు. ఇంతలోనే ఒక సీమాంధ్ర మీడియాలో వార్తలు అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమౌతోందంటూ సొల్లు వార్తలు. ఇక్కడ తెలంగాణ వాదుల ఆత్మగౌరవ పోరాటాన్ని, ఆకలి కేకల పోరాటాన్ని కించపరిచే విధంగా చూపే సీమాంధ్ర మీడియా అక్కడి పెట్టుబడిదారుల ఉద్యమాన్నే నిజమైన ఉధ్యమంగా చూపి కృత్తిమ ఉద్యమాన్ని తెర వెనుక ఉండి తోలుబొమ్మలాట ఆడించింది. దీనికి తోడు తెలంగాణ వస్తే ఎక్కడ తమ ప్రయోజనాలు దెబ్బతింటాయో అన్న భయంతో సీమాంధ్ర పెట్టుబడి దారులు ఢిల్లీలో లాబీయింగ్‌ చేశారు. సీమాంధ్ర మీడియా ప్రచార హోరో..సీమాంధ్ర నేతల లాబీయింగో వచ్చే తెలంగాణ వెనక్కి పోయింది. డిసెంబర్‌ 23న హొంమంత్రి చిదంబరం మళ్లీ మాట్లాడుతూ ఏకాభిప్రాయ సాధన కోసం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశామని, తెలంగాణ కొరకు ఒక ఏడాది పాటు ఆగాలన్నారు. శ్రీకృష్ణ తెలంగాణ, సీమాంధ్రల్లో పర్యటించి వివరాలను సేకరించింది. తెలంగాణ కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న సమయంలో ఏకాభిప్రాయ సాధన కోసం అంటూ ఓ కమిటీ ఏర్పాటు చేయడం ఓ విడ్డూరమైతే పరీక్షలలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల్లా ఆరు సూచనలు చేయడం  మరో విడ్డూరం. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టును ఇచ్చి 18 నెలలు దాటింది. అయినా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు వారికి కావాల్సిన ఏకాభిప్రాయం రాలేదు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మొదట నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కావాలన్నారు..అవి అయిపోయాయి..తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికలన్నారు…బక్రీద్‌కే బాద్‌ అన్నారు..ఏమయిందో తెలియదు..ఉపెన్నికల తర్వాత మాట్లాడుతామని తెలిపారు..తర్వాత మూడు రాష్ట్రాల ఎన్నికలన్నారు…అవీ అయ్యాయి..తర్వాత రాష్ట్రపతి ఎన్నికలు అవనీయండి అన్నారు. అవీ అయ్యాయి. తెలంగాణ వ్యతిరేకి అయిన ప్రణబ్‌ రాష్ట్రపతి కూడా అయ్యారు. ఇకనైనా తెలంగాణపై మాట్లాడాల్సిన అవసరం ఉంది..తెలంగాణకు అనుకూలంగా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల ఇక్కడ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే నేడు, రేపు అంటూ తెలంగాణపై కాలయాపన చేసింది చాలు..పూటకో మాట మాట్లాడుతున్న చిదంబరాన్ని, ఊసరవెల్లిలా రంగులు మార్చే రాజకీయ పార్టీలను నమ్మడం ప్రజలు ఎప్పుడో మానేశారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకోవాలి. అసలు ఇస్తారో…ఇవ్వరో తేల్చాలి..ఎందుకంటే ఇవ్వకపోతే ఎలా పోరాడాలో తెలంగాణ ప్రజలకు కొత్త కాదు..అసలు పోరాటాలనేవి తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య లాంటివి. అందుకే పోరాటాలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించుకోవడానికి తెలంగాణ ప్రజలు

సిద్ధమవుతారు. పోరాటాల అజెండాను తయారు చేసుకొంటారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. అందుకే ఇక మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్న జేఏసీతో కలిసి ఉద్యమం చేయడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు..ఇంకెపుడు ఇస్తరు..మా తెలంగాణ అంటూ నిగ్గదీసి అడుగుతున్నారు..ప్రజల మధ్య వైషమ్యాలు పెరగక ముందే అసోంలా పరిస్థితులు మారకముందే తెలంగాణ ఇస్తే అది పాలకులకే శ్రేయస్కరం..