ఇదేమి రాజ్యం ! పోలీసు పాలనా.. ప్రజాస్వామ్య పాలనా ?

విజయమ్మది ముమ్మాటికి తెలంగాణపై దండయాత్రనే
పోలీసుల పాశవిక దాడిని ఖండించిన కోదండరామ్‌
హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్ల పర్యటనపై తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది ప్రజాస్వామ్య పాలనా.. లేక పోలీసుల రాజ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణపై విజయమ్మ స్పష్టమైన ప్రకటన చేయకుండా ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై విజయమ్మ దండయాత్ర చేశారని విమర్శించారు. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు జగన్‌ ప్రాణం ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను లెక్కచేయ కుండా వ్యవహరిస్తున్న
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని కోదండరామ్‌ హెచ్చరించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే తారకరామారావును అతిథి గృహంలో నిర్బం ధించి విజయమ్మను మాత్రం ఎలా అనుమ తిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై జరిగిన దాడిని తెలంగాణ కాంగ్రెస్‌, ఇతర పార్టీల సభ్యులు తీవ్రంగా ఖండించాలని కోరారు. తెలంగాణ ప్రజలపై సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలతో పోలీసులు రెచ్చిపోయారని, దీనిపై తెలంగాణవాదులు నోరు విప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ వాదులపై పోలీసు దాడి అమానుషమని అన్నారు. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఆడుతున్న డ్రామాను ఎండగడతామని కోదండరామ్‌ హెచ్చరించారు. ఈ రెండు పార్టీల వైఖరిని ప్రజల్లోకి తీసుకు వెళతామని కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా విజయమ్మ చేనేత కార్మికుల సమస్యలను అడ్డుపెట్టుకుని దీక్ష చేపట్టడం అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రేక్షకపాత్ర వహించొద్దని, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల వైఖరిని ఎండగట్టాలని కోదండ రామ్‌ పిలుపునిచ్చారు. విజయమ్మను సిరిసిల్లకు రాకుండా తెలంగాణ ప్రజలు అడుగడుగునా అడ్డు కోవడంలో విజయం సాధించారని అన్నారు. జగన్‌ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి పీఠంపై అర్రులు చాస్తున్నారని కోదండరామ్‌ ఆరోపించారు. సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ జెఎసి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటామని చెప్పారు. ముఖ్యంగా విజయమ్మ పర్యటన సందర్భంగా పోలీసులు జరిపిన దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి కరీంనగర్‌ జిల్లా బంద్‌కు ఇచ్చిన పిలుపునకు తమ సంపూర్ణ మద్దతును కోదండరామ్‌ ప్రకటించారు.