యూరియా కొరత రైతు ప్రాణం మీదకు తెచ్చింది
సెప్టెంబర్ 10(జనంసాక్షి): రాష్ట్రంలో యూరియా కొరత ఓ రైతు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అందరికంటే ముందు వెళ్లి క్యూలైన్‌లో నిల్చుంటేనే యూరియా దొరుకుతుందని తెల్లవారుజామునే బయల్దేరి ప్రమాదం బారిన పడ్డాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి గుంతలో పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. భూక్య తండాకు చెందిన బోడ నర్సింగ్ యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడేందుకు బుధవారం తెల్లవారుజామునే లేచి 4 గంటలకు ఇంటి నుంచి బయల్దేరాడు. పురుషోత్తమగూడెం రైతు వేదిక వద్దకు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. మధ్యలో అదుపుతప్పి గుంతలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో ఆ గుంతలోనే స్పృహ తప్పిపడిపోయాడు.
దాదాపు గంట తర్వాత అటు నుంచి వెళ్తున్న పలువురు.. రైతును చూసి 108కి కాల్ చేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే రైతును మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రైతు బోడ నర్సింగ్ తలకు, చేతులకు తీవ్రంగా గాయలయ్యాయి.