త్వరలో అందుబాటులోకి బతుకమ్మ కుంట

` సీఎం ఆధ్వర్యంలో ప్రారంభిస్తాం :హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
` ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి):బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తాం అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నార . ఈసారి బతుకమ్మ పండుగ అక్కడే నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నాం అని కమిషనర్‌ తెలిపారు.సున్నం చెరువులో పనులు ఆపమని కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్‌ రాలేదన్నారు. ఇకపోతే యాకుత్‌పురాలో ఐదేళ్ల బాలిక పాఠశాలకు వెళ్తూ ప్రమాదవశాత్తూ మ్యాన్‌ హోల్‌లో పడిపోయిన ఘటనపై హైడ్రా స్పందించింది. అయితే ఘటనపై వెంటనే గమనించిన బాలిక నాయనమ్మ, స్థానికులు సురక్షితంగా కాపాడారు. హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఘటనపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించారు. యాకుత్‌పురా ఘటనపై రాజకీయపరంగా చేసే విమర్శలపై స్పందించను. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం అన్నారు. హైడ్రా వల్లే తప్పు జరిగిందని గుర్తించామని, ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో ఉన్న మ్యాన్‌హోల్స్‌పై ఆడిట్‌ చేస్తున్నాం. మూతలు సరిగాలేనివి గుర్తించి.. సంబంధిత ఏజెన్సీకి సెక్రటరీ ద్వారా రిఫర్‌ చేస్తాం. జీహెచ్‌ఎంసీ, వాటర్‌ బోర్డు, హైడ్రా మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదు. బ్లేమ్‌ గేమ్‌ కాకుండా సమన్వయంతో ముందుకెళ్లాల్సి ఉందన్నారు. మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌ ఇన్‌ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడు.. అతనిపై చర్యలు తీసుకుంటాం. ఆ చుట్టుపక్కల నాలుగైదు మ్యాన్‌ హోల్స్‌ ఉన్నాయి.. అందులో ఒకటి వాటర్‌ బోర్డు వాళ్లు క్లీన్‌ చేశారు. ఘటన జరిగిన మ్యాన్‌ హోల్‌ మాత్రం హైడ్రా సిబ్బంది క్లీన్‌ చేశారు. మంచి చేస్తేనే మా ఖాతాలో వేసుకోవడం కాదు.. తప్పు జరిగినప్పుడు కూడా అంగీకరిస్తున్నాం. ఇతర శాఖలతో చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు లేవు. జీహెచ్‌ఎంసీ పెద్ద ఆర్గనైజేషన్‌.. మేము ఎవరిపై పెత్తనం చెలాయించట్లేదు. మా అందరికీ బాస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉన్నారు. మా శాంక్షన్‌ అయిన బడ్జెట్‌లో 3 నెలలది మాత్రమే రిలీజ్‌ అయింది. హైడ్రా పోలీస్‌ స్టేషన్‌లో త్వరలో కేసులు నమోదు చేస్తాం.