ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం
రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము
హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు-, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ- సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉప రాష్ట్రపతులనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, వెంకయ్యనాయుడు, హవిూద్ అన్సారీ తదితరులు కూడా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పియూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రదాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఎన్డీయే కూటమికి చెందిన నేతలు, ఎంపీలు, పలు రాష్టాల్ర్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈనెల 9న జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన సవిూప ప్రత్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నిక లాంఛనాలన్నీ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి సీపీ రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ముర్ము అప్పగించారు. ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఫ్‌ు లాంటి సంస్థలతో 16 ఏండ్లకే రాధాకృష్ణన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా, 2003 నుంచి 2006 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన రాష్ట్రంలో 93 రోజుల పాటు 19 వేల కి.విూ రథయాత్ర నిర్వహించారు. 2024, జూలై 31న ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్‌గా ఏడాదిన్నర పాటు చేశారు. తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా, పుదుచ్చెరి లెప్ట్‌నెంట్ గవర్నర్‌గానూ పనిచేశారు. 1998, 1999లో కోయంబత్తూర్ నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా చేశారు. అభిమానులు ఆయనను తమిళనాడు మోదీగా పిలుస్తారు.
రాష్ట్రపతి భవన్‌లో జగదీప్ ధన్‌ఖడ్
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎట్టకేలకు దర్శనమిచ్చారు. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా అనంతరం ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ప్రొటోకాల్ ప్రకారం.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోయారు. దీంతో ’జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ..?’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ధన్‌ఖడ్ గృహనిర్బంధంలో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ధన్‌ఖడ్‌ను తాము చేరుకోలేకపోతున్నామని, ఆయన ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసినప్పటి నుంచి ధన్‌ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన భద్రతపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ధన్‌ఖడ్‌కు ఏం జరిగింది..? ఆయన క్షేమంగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా..? అని ప్రశ్నించారు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ ఎంపీలు ప్రయత్నించినట్లు- చెప్పారు. కానీ, ఆయన్ని చేరుకోలేకపోతున్నట్లు- వెల్లడిరచారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో జూలై 21 రాజీనామా తర్వాత అదృష్యమైన ధన్‌ఖడ్.. ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమానికి హాజరై తనపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. ప్రమాణ స్వీకరం కార్యక్రమంలో మరో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పక్కనే కూర్చుని సంభాషిస్తూ కనిపించారు. ఎంతో ఉల్లాసంగానూ ఉన్నారు. జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ధన్‌ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ రోజు ఉదయమంతా రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన.. రాత్రికల్లా అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి దిగిపోతున్నట్లు- తెలిపారు. అయితే, నోట్ల కట్టల కేసుకు సంబంధించిన జస్టిస్ యశ్వంత్‌వర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్రంతో విభేదాలు రావడం వల్లే ఆయన వైదొలిగినట్లు- విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవిని వీడిన తర్వాత తొలిసారి ధన్‌ఖడ్ బయట కనిపించారు.