అమెరికాతో కలిసి చేస్తాం

ఐటీ సంస్థలను కాపాడుకుంటాం
` కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్‌ ట్రంప్‌’ ఇండియన్‌ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రి ‘అశ్విని వైష్ణవ్‌’ కీలక వ్యాఖ్యలు చేశారు దాదాపు 300 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఐటీ పరిశ్రమ వృద్ధిని కాపాడేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.ఆయన ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిరచారు. అమెరికాలో ట్రంప్‌ సర్కారు భారత ఐటీ ఔట్‌సోర్సింగ్‌ సంస్థలను లక్ష్యంగా చేసుకోవచ్చనే భయాలు వ్యాపిస్తున్న వేళ ఈ ప్రకటన రావడం గమనార్హం. ఈ విషయంలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు, ఇతర సర్వీస్‌ ఆపరేషన్లను భారత్‌లో నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, ఐరోపా, జపాన్‌, ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో కేవలం ఐటీ రంగంపైనే ఆధారపడకుండా.. ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్‌, తయారీ రంగాలను ప్రోత్సహించేందుకు వేగంగా చర్యలు చేపడుతోందన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో భారత్‌ వాటా పెరిగిందన్నారు.భారత ఐటీ సేవల రంగంలో దాదాపు 5.67 మిలియన్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ రంగం దేశానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎగుమతి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. భారత్‌ సంస్థలకు ఐటీ ఔట్‌ సోర్సింగ్‌ చేయడంపై ట్రంప్‌ సర్కారు ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది.ఈ ఏడాది భారత్‌లో టెక్నాలజీ అత్యధిక వృద్ధి రేటు నమోదు చేయనుంది. అధిక భాగం ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్ల పెరుగుదల దీనికి కారణం కానున్నట్లు నాస్కామ్‌ నివేదిక వెల్లడిరచింది. అమెరికాలోని ట్రంప్‌ కార్యవర్గం భారత్‌కు చెందిన ఐటీ ఎగుమతి, కాల్‌సెంటర్లపై టారిఫ్‌లు విధించవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిరత కారణంగా ఐటీ రంగం ఇప్పటికే ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఇటీవల కాలంలో తరచూ భారత్‌పై విషం కక్కుతున్న ట్రంప్‌ సలహాదారు పీటర్‌ నవారో ఓ పోస్టును షేర్‌ చేశారు. దీనిలో విదేశాలకు ఔట్‌ సోర్సింగ్‌ చేయడంపై భారీగా టారిఫ్‌లు విధించాలని కోరారు. ఐటీ రంగానికి అమెరికా అత్యంత కీలకమైంది. అత్యధిక ఆదాయాలు ఆ రంగం నుంచే లభిస్తాయి. ట్రంప్‌ కార్యవర్గం ఎలాంటి సేవలపై టారిఫ్‌లు విధించే అవకాశం ఉందన్నదానిపై స్పష్టత లేదు. రాజకీయ వ్యాఖ్యాత లారా లూమర్‌ కూడా ఇటీవల కాలంలో తరచూ ఐటీ కాల్‌ సెంటర్ల లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికా టారిఫ్‌లు విధిస్తే.. అక్కడ ఐటీ ఆపరేషన్స్‌ తీవ్రంగా దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ట్రంప్‌ కార్యవర్గం ఈ దిశగా ఇప్పటి వరకు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు.
భారత్‌ ఐటీ రంగం ఆందోళన ఏమిటీ..?
ట్రంప్‌ కార్యవర్గం టారిఫ్‌లను విధిస్తే భారత్‌ సంస్థలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఆ దేశంలో భారీ పన్నులు చెల్లిస్తున్నాయి. దీనికి అదనంగా టారిఫ్‌లు విధిస్తే.. రెండుసార్లు పన్నుపోటు బారిన పడినట్లవుతుంది. దీనికి తోడు వీసా రూల్స్‌, స్థానికులను నియమించుకోవడంతో ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు ఖరీదైన వ్యవహారంగా మారాయి.భారత్‌ ఔట్‌సోర్సింగ్‌ రంగం విలువ 283 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుంది. దీనిలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో వంటి సంస్థలు ఉన్నాయి. వీటి ఆదాయాల్లో 60 శాతం వరకు అమెరికా నుంచే లభిస్తోంది.
అంత ఈజీ కాకపోవచ్చు..
సరుకుల దిగుమతి మీద విధించినంత తేలిగ్గా ఐటీ దిగుమతులు, ఔట్‌ సోర్సింగ్‌పై టారిఫ్‌లు విధించలేరని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో దిగ్గజ సీఈవోలు మొత్తం ట్రంప్‌ కార్యవర్గంతో చాలా సన్నిహితంగా ఉంటారు. వారిలో చాలా మంది భారత్‌కు అనుకూలురు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వారి వ్యాపారాలు లాభదాయకంగా ఉండాలంటే.. భారత్‌ నుంచి నిపుణులను నియమించుకోవాల్సి ఉంటుంది. అవి హెచ్‌1బీ వీసాలతో అమెరికాకు రప్పించి లేదా.. రిమోట్‌ విధానంలో అయిన పనిచేయించుకోవాల్సి ఉంటుంది. పైగా ట్రంప్‌ ఇటువంటి నిర్ణయం తీసుకొంటే దానిని పాలసీగా కాకుండా.. భారత్‌కు పంపించే రాజకీయ సందేశంగా భావించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.