ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా మహ్మద్‌ ముర్సి

కైరో, జూలై 1: మహ్మద్‌ ముర్సి ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ ధికారంలోకి వచ్చింది. 84 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఈ గ్రూపు అధికారం చేజిక్కించుకుంది. కాని సైన్యం మాత్రం తన పట్టు బిగించాలనే ప్రయత్నం చేస్తోంది. ఈజిప్టు రాజ్యాంగ కోర్టు ఆయనతో ప్రమాణం చేయించింది. మొదటి పౌర ప్రభుత్వం అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేశారు. దేవుని పేరిట నేను చిత్తశుద్ధితో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవిస్తాను. పూర్తిగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను అని 60 ఏళ్ల ముర్సి రాజ్యాంగ కోర్టులో ప్రమాణం చేశారు. మెరుగైన భవిష్యత్‌, కొత్త ఈజిప్ట్‌ కోసం కృషి చేస్తామన్నారు. పూర్తిస్వేచ్ఛ, నిజమైన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్థిరత్వానికి అర్ధం, గుర్తింపును తీసుకొచ్చారని అన్నారు. ప్రజాస్వామ్య మూలస్తంభాలైన రాజ్యాంగ కోర్టు, ఈజిప్టు న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక శాసనబద్ధమైన అధికారాలపై ఆధారపడి తన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. అరబ్‌ ప్రపంచంలో స్వేచ్ఛగా ఎన్నికైన ఇస్లామిస్ట్‌ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేశారు. ఈ దేశానికి ఈయన 5వ అధ్యక్షుడు. 60 ఏళ్ల క్రితం నియంతృత్వాన్ని తోసిరాజని ఈజిప్ట్‌లో ప్రజాప్రభుత్వం వచ్చింది. చీఫ్‌ జస్టిస్‌ ఫరూఖ్‌ సుల్తాన్‌ నేతృత్వంలో సుమారు 18 మంది అత్యున్నత న్యాయమూర్తుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.