సీఎం రేవంత్‌ అసభ్యకర ఫోటోల దర్యాప్తుకు ‘సిట్‌’ ఏర్పాటు

` మహిళా ఐఏఎస్‌ అధికారిణిని కించపరుస్తూ వచ్చిన వ్యాఖ్యలపై కూడా దర్యాప్తు
` ఈ మేరకు డీజీపి శివధర్‌రెడ్డి ఉత్తర్వులు
` నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌కు బాధ్యతలు
హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌ సీసీఎస్‌తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలన కేసుల్లో తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నాయకత్వం వహించనున్నారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులతో ఈ ప్రత్యేక బృందాన్ని డీజీపీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా పోస్ట్‌ చేసిన వ్యవహారంలో తెలంగాణా పబ్లిక్‌ టీవీ వాట్సాప్‌ గ్రూప్‌నకు చెందిన కావలి వెంకటేశ్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్‌ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిని కించపరిచే విధంగా వార్తలు టెలికాస్ట్‌ చేసిన వ్యవహారంలో హైదరాబాద్‌ సీసీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో రెండు తెలుగు న్యూస్‌ ఛానల్స్‌, ఏడు యూట్యూబ్‌ ఛానళ్లపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఐఏఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ రెండు కీలక కేసుల్లో దర్యాప్తు బాధ్యతను సిట్‌కు అప్పగించారు. నారాయణపేట జిల్లా మద్దూర్‌, హైదరాబాద్‌ సీసీఎస్‌లో నమోదైన కేసులపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుచేసింది. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ నేతృత్వంలో 8 మందితో సిట్‌ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కావలి వెంకటేశ్‌ అనే వ్యక్తి సీఎం ఫొటోలను అసభ్యకరంగా రూపొందించి వాట్సప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశాడు. మహిళా ఐఏఎస్‌ను కించపరుస్తూ వార్తలను ప్రచారం చేయడంపై సీసీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐఏఎస్‌ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు రెండు తెలుగు న్యూస్‌ ఛానళ్లతో పాటు ఏడు యూట్యూబ్‌ ఛానళ్లపై కేసులు పెట్టారు. ఈ రెండు కేసుల వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు చేయనుంది. సిట్‌లో సభ్యులుగా నార్త్‌ రేంజ్‌ జాయింట్‌ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌, హైదరాబాద్‌ అడ్మిన్‌ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్‌ కైమ్ర్‌ డీసీపీ అరవింద్‌ బాబు, విజిలెన్స్‌ అదనపు ఎస్పీ ప్రతాప్‌, సీసీఎస్‌ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్‌సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి, సైబర్‌సెల్‌ ఎస్సై హరీశ్‌ ఉన్నారు.