కుంభమేళాకు మించి మేడారం జాతర

` రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు
` సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ
` జాతర ఏర్పట్లపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, సీతక్క సమీక్ష
హైదరాబాద్‌(జనంసాక్షి):ఈనెల 28వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి గతంకన్నా రెట్టింపు సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్షణ్‌ కుమార్‌, దనసరి అనసూయలు అన్నారు. మేడారం జాతరపై డా. బీ.ఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సవిూక్ష సమావేశంలో మంత్రులు,అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్‌ కుమార్‌, సబ్యసాచి ఘోష్‌, అడిషనల్‌ డీజీలు విజయ్‌ కుమార్‌, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, గత 2024 మేడారం జాతరకు కోటిన్నర మంది హాజరుకాగా, ఈసారి 2026 లో జాతరకు దాదాపు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ. 150 కోట్ల నిధులను మంజూరు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని వివరించారు. సమ్మక్క?సారలమ్మ జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మహాజాతరను విజయవంతంగా నిర్వహించడం ప్రతి అధికారికి ఒక బాధ్యతగా తీసుకుని, ఏ చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఈ జాతరకు రూ.150 కోట్లకుపైగా నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ నిధులతో మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి, జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అయోమయానికి గురికాకుండా ట్రాఫిక్‌ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్‌ మ్యాప్‌లతో పాటు అవసరమైన చోట వన్‌వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. ఈ జాతరపై క్యాబినెట్‌ మొత్తం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రులందరూ సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అడ్లూరి తెలిపారు. ఇలాంటి స్థాయి సమిష్టి పర్యవేక్షణ గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సహా పలు రాష్టాల్ర నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా వసతి, పార్కింగ్‌, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్‌ విషయంలో వీఐపీలు,సామాన్య భక్తులు అనే తేడా లేకుండా, అందరికీ సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పంచాయితీ రాజ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ, ఈసారి జాతర ఏర్పాట్లకు రూ. 150 కోట్లతో పాటు గ్దదెల పునరుద్ధరణ పనులకు రూ. 101 కోట్లు మొత్తం 251 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యత నిస్తున్నట్టు అన్నారు. ఇందుకు గాను ప్రతీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్‌.ఓ.డీ లతో ప్రత్యేకంగా వాట్స్‌`అప్‌ గ్రూప్‌ ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్‌, తాగునీరు, రవాణా, భద్రతాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్‌ లను మరింత పెంచాలని కోరారు. జాతర సందర్భంగా గురు, శుక్ర వారాల్లోనే ప్రతి రోజు కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మేడారం జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 2010 నుండి ప్రతీ సంవత్సరం వస్తున్నారని, వచ్చే వందేళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని సీతక్క గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ రావు మాట్లాడుతూ, జాతర నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నందున అన్ని శాఖల ఉన్నతాధికారులు జాతర పనులకు సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సాధించాలని పేర్కొన్నారు. జాతర సందర్భంగా భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందించాలని తెలిపారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ నియంత్రణకుగాను డ్రోన్‌ లను ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా, జాతర సమాచారాన్ని, నియమ నిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్‌ ను/ క్యూ.ఆర్‌ కోడ్‌ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. పార్కింగ్‌ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా వాటర్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్‌, పరిశుభ్రతపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలన్నారు. ప్రస్తుతం మేడారంలో జరుగుతున్న జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. ఈ సందర్భంగా, మేడారం జాతరకు వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, చేపట్టిన పనులు, వాటి పురోగతి పై ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర పవర్‌ పాయింట్‌ ప్రసెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈసారి జాతరకు దాదాపు మూడు కోట్ల మంది హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. తదితర ప్రారంభానికి ముందే దాదాపు 30 శాతం భక్తులు సందర్శిస్తారని అన్నారు. జాతర సమయంలో 60 శాతం నుండి 65 శాతం వరకు, జాతర అనంతరం 5 శాతం భక్తులు మేడారం సందర్శిస్తారని వివరించారు. మేడారం జాతరపై ములుగు జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్‌, వీడియోలను మంత్రులు సీతక్క, లక్షణ్‌ కుమార్‌, సి.ఎస్‌ రామకృష్ణరావులు ఆవిష్కారించారు.

18న మేడారంలో కేబినేట్‌ భేటి ?
` సమ్మక్క జాతరకు హాజరు కానున్న సీఎం రేవంత్‌
` 19న మేడారం పనులకు ప్రారంభోత్సం
` అదే రోజు రాత్రి దావోస్‌ పయనం
` సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
ములుగు(జనంసాక్షి):సమ్మక్క` సారలమ్మలను దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వచ్చే కొత్త దారికి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. సీఎం నేరుగా హెలీప్యాడ్‌ నుంచి కాన్వాయ్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ విూదుగా దేవస్థానం ముందు ప్రధాన ద్వారం వద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సీఎం వచ్చే దారికి భక్తుల క్యూలైన్‌గా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దీంతో సీఎం రాకతో భక్తుల దర్శనాలు నిలిపివేసి వారు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కొత్త దారిని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే మహాజాత రకు మేడారం వచ్చే భక్తుల సౌకర్యాల్లో భాగంగా స్నాన ఘట్టాలకు అధికారులు పెయింటింగ్‌ పనులు ప్రారంభించారు. మెట్లు శుభ్రంగా ఉండే విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సమ్మక్క` సారలమ్మలను దర్శించుకోవ డానికి తరలివచ్చే భక్తులకు అధికారులు ఉచితంగా తాగు నీరు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాక్టర్‌ ద్వారా ట్యాంకులు ఏర్పాటు చేసి అందజేస్తున్నారు.
18న మేడారంలో కేబినేట్‌ భేటీ ?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజదాని
వెలుపల కేబినేట్‌ భేటీ జరపాలని నిర్ణయించడం ఇటీవల ఇదే ప్రథమం. అయితే సిఎం షెడ్యూల్‌ కారణంగా అక్కడ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా సమాచారం తెలియాల్సి ఉంది. ’సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర’ ఈ నెల 28న ప్రారంభం కానుండడంతో.. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో క్యాబినెట్‌ భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సీపీఐ వంద సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటుంది. 5 గంటల తర్వాత క్యాబినెట్‌ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్‌కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశముంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైనా క్యాబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బ్జడెట్‌ ప్రవేశపెట్టనుండడంతో.. అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. రైతుభరోసా నిధుల విడుదల, హ్యామ్‌ రోడ్లు, తదితర అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.