52,43,023 మంది ఓటర్లు
` మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుదిజాబితా ప్రకటన
` వీరిలో 25,62,369 మంది పురుష.. 26,80,014 మంది మహిళా ఓటర్లు
` నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడిరచింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు కాగా.. 26,80,014 మంది మహిళా ఓటర్లు, 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్‌లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా.. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలకశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మొత్తం ఎన్నికల పర్వంలో రిజర్వేషన్ల పక్రియ అత్యంత కీలకం కావడంతో అధికారులు దీనిని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.


