రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దు

 

 

 

 

 

 

 

 

చెన్నారావుపేట, జనవరి 12( జనం సాక్షి):

పంటలకు సరిపడా యూరియాను అందిస్తాం..

నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి..

గ్రామాలలోని రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని పంటల అవసరం మేరకు సరిపడా యూరియాను అందిస్తామని నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం చెన్నారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ ఏడాది యాసంగిలో నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 1లక్ష 31 వేల ఎకరాల సాగు అంచనా ఉందన్నారు. ఈ పంటలన్నింటికి కలిపి మొత్తం సుమారు 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. ఇందుకుగాను ఇప్పటివరకు 11వేల 600 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా పంట విస్తీర్ణాలు, దశలకు అనుగుణంగా ప్రతి గ్రామపంచాయతీకి వెళ్లి, వ్యవసాయ శాఖ క్షేత్ర సిబ్బంది విడతలవారీగా పారదర్శకంగా నేరుగా రైతులకు టోకెన్ల ద్వారా ఏలాంటి అసౌకర్యం లేకుండా యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం దగ్గర అవసరమైనంత యూరియా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం నుండి సాగుకు అవసరమైనటువంటి తగినంత యూరియా నిరంతరాయంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అలాగే రైతులు తమ సాగుకు అవసరమైన మేరకు మాత్రమే యూరియాను తీసుకెళ్లి ఉపయోగించుకోవాలన్నారు. రైతులు కొన్నిచోట్ల యూరియా బస్తాలను ఎక్కువ రోజులు నిలువ చేయడం వల్లఅవి గడ్డకట్టి దానిలో ఉండవలసిన పోషకాల పరిమాణం తక్కువైపోయి, వాటిని పంటలకు వాడడం వల్ల అనుకున్న సరైన మోతాదులో పోషకాలు అందక కొంత నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.రెవెన్యూ పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతు కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను కచ్చితంగా చేసుకోవాలని సూచించారు.ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినటువంటి పీఎం కిసాన్, పంట బ్యాంకు రుణాలు, త్వరలో ప్రవేశపెట్టబోయే పంటల బీమా తదితర పథకాలు సులభతరంగా పారదర్శకంగా అందించబడతాయన్నారు. ఈ విషయాన్ని గమనించి రైతులు, మీ సమీపంలో ఉన్న మీసేవ కేంద్రంలో లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారిని సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను ఖచ్చితంగా, త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో చెన్నారావుపేట వ్యవసాయ అధికారి గోపాల్ రెడ్డి, పాల్గొన్నారు.