ముత్తంగి టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయి పట్టివేత

జనవరి 12(జనం సాక్షి):సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు ముత్తంగి ఔటర్‌రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హ్యుందాయి కారు, డీసీఎం వాహనాలను తనిఖీ చేయగా 92 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ గంజాయిని ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సోలాపూర్‌కు చెందిన సచిన్ గంగారాం, మహేశ్, విజయ్‌గా గుర్తించారు. అలాగే మొత్తం 92 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.11 వేల నగదు, హ్యుందాయి కారు, డీసీఎం వాహనం, ఐదు సెల్‌ఫోన్లను కూడా సీజ్ చేశారు. ఈ గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠాపై పోలీసులు దృష్టిసారించారు.


