అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం గర్హనీయం : జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 13 (జనంసాక్షి) : రాజ్యాంగం హామీ ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత విలువైనదని, సమాజానికి ప్రాణవాయువు లాంటిదని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్‌ లోకాయుక్తా (గోవా) జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే రాజ్యాంగం పరిమితుల్లేని స్వేచ్ఛకు హామీనివ్వలేదని తెలిపారు. ఇటీవల ఓ ఐఏఎస్‌ అధికారిణి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రసారం చేసిన కథనాలను సుదర్శన్‌ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ఖండిరచారు. సోషల్‌ మీడియా అయినా సరే, ప్రధాన స్రవంతిలోని మీడియా అయినా సరే.. ప్రచార సాధనాలు ఏవైనా, బాధ్యత లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగిస్తే నియంత్రణ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుందని, ఇది కూడా అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ, సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించడం చేతగాకపోతే మీ భావ ప్రకటనా స్వేచ్ఛను మరొకరు నియంత్రించకుండా మీకు మీరే ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటే మంచిదని సూచించారు. తమ బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేటువంటి యువ అధికారిణిల పట్ల అసభ్యంగా, బాధ్యతా రహితంగా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అమర్యాదగా, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా రాయడం, కూయడం అత్యంత గర్హనీయమని, పురుషాధిక్యత భావజాలంతో కూడిన ప్రమాదకరమైన దుశ్చర్య అని తన ప్రకటనలో తప్పుబట్టారు.