ఉదయ్‌ పథకంలోకి తెలంగాణ

C

– ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్రమంత్రి గోయల్‌ భేటి

హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):కంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్‌ పథకంలో రాష్ట్రం చేరుతుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇవాళ హైదరాబాద్‌ వచ్చిన గోయల్‌.. ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్‌ ను కలిశారు. డిస్కంల నష్టాలను తగ్గించడానికి ఉదయ్‌ పథకంలో భాగస్వాములవుతామని ముఖ్యమంత్రి చెప్పారు. డిస్కంల అప్పులు తీర్చి వాటి ఆర్థిక భారాన్ని తగ్గిస్తామన్నారు. అలాగే ఉదయ్‌ లో చేరడం ద్వారా జరిగే పరిణామాలపై కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్‌ విస్తృతంగా చర్చించారు.రాష్ట్రంలో ఎల్‌ఈడీ బల్బుల వాడకంపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే 26 నగర పంచాయతీలు, 12 మున్సిపాలిటీలలో ఎల్‌ఈడీ బల్బులు వాడుతున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 22 లక్షలకు పైగా పంపుసెట్లు ఉన్నాయని, వాటి వల్ల ఎక్కువ విద్యుత్‌ వినియోగం అవుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తక్కువ విద్యుత్‌ వినియోగించుకుని, ఇంటి నుంచే నిర్వహించుకునే అధునాతన పంపుసెట్లు వచ్చాయని, వాటిని తెలంగాణలో విరివిగా వాడాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పంపుసెట్లను దశల వారీగా మార్చుకునేందుకు కేంద్రం సాయం చేస్తుందన్నారు. తక్కువ విద్యుత్‌ అవసరమయ్యే ఫైవ్‌ స్టార్‌ ఫ్యాన్ల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు గోయల్‌.ఎక్కడ బొగ్గు గనులున్నాయో అక్కడే విద్యుత్‌ ప్లాంట్లు ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సీఎం కేసీఆర్‌ గోయల్‌ కు తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్‌ ప్లాంట్లకు ఎక్కువ బొగ్గును సింగరేణి నుంచే కేటాయించడం వల్ల రవాణా భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలను అధిగమించడంతో పాటు.. రాబోయే రోజుల్లో మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్‌ గోయల్‌ కు వివరించారు. సీఎం కేసీఆర్‌ వివరణలు సావధానంగా విన్న కేంద్ర మంత్రి గోయల్‌.. విద్యుత్‌ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.