ఉపపోలింగ్‌కు పకడ్బందీ చర్యలు : దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 11 : ఉప ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు భారీగా పోలీసులను మొహరింపజేశామన్నారు. ఉప ఎన్నికలు జరిగే 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 3వేల సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించినట్టు ఆయన తెలిపారు. దీంతో పాటు 93 నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలను కూడా గుర్తించామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని దినేష్‌రెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల్లో భాగంగా 56 ఎపిపిఎస్‌పి కంపెనీలను, 3వేల మంది కానిస్టేబుళ్లను, 1500 మంది హోంగార్డులను, 2వేల మంది ఇన్‌స్పెక్టర్లను నియమించినట్టు దినేష్‌రెడ్డి తెలిపారు. 270 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఉప ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఉండేందుకు  100 కంపెనీల ప్రత్యేక బలగాలను నియమించినట్టు తెలిపారు. ఎన్నికల తర్వాత దాడులు జరుగుతాయేమోనన్న సమాచారం మేరకు పోలీసులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఉప ఎన్నికల్లో దాడులు నిర్వహించేందుకు పథకాలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనప్పటికీ ఉపేక్షించబోమన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 135 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఉప ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు  అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. పార్టీలు చూపే ప్రలోభాలకు ఓటర్లు తలొగ్గవద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా గత వారం రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణలో పోలీసు మొబైల్‌ వాహనాలను గస్తీ తిప్పుతున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 30కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని దినేష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.